తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల బరిలో చిత్ర విచిత్రాలో చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల బావ‌లు మ‌ర‌ద‌ళ్లు పోటీ ప‌డుతుంటే.. మ‌రి కొన్ని చోట్ల భార్య‌, భ‌ర్త‌లు పోటీ చేస్తున్నారు.. కొన్ని చోట్ల త‌ళ్లి, కూతుళ్లు కూడా కౌన్సెల‌ర్లు గా రంగంలో ఉన్నారు. చాలా వార్డుల‌లో అధికార టీఆర్ఎస్‌, విప‌క్ష కాంగ్రెస్ పార్టీల నుంచి భార్య‌, భ‌ర్త ఇద్ద‌రూ కూడా ఎన్నిక‌ల సంగ్రామంలో ఉన్నారు. ప‌రిధి త‌క్కువుగా ఉండ‌డం.. పోటీ చేసేందుకు ఆర్థిక‌, అంగ బ‌లాల ప‌రంగా స‌రైన అభ్య‌ర్థులు లేక‌పోవ‌డంతో ఇలా కుటుంబ స‌భ్యులే పోటీ చేయాల్సిన ప‌రిస్థితి. 

 

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో కొత్త కోట మునిసిపాల్టీలో ఇద్దరు భార్యాభర్తలు బరిలో నిలిచారు. ఒక జంటలో భర్త శ్రీనివాసులు ఏడో వార్డు నుంచి పోటీ చేస్తుండగా, భార్య మాజీ సర్పంచ్‌ అయినటువంటి అరుణ 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరు కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీ ఫారంతో పోటీపడుతున్నారు. ప్రస్తుతం అరుణ పోటీ చేస్తున్న 9వ వార్డులో టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థి సుఖేశిని పోటీలో ఉన్నారు. దీంతో 9వ వార్డులో పోటీ మాంచి ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

 

అలాగే మరో జంట అయినటుంటి వారిలో నాగన్న 8వ వార్డు నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన భార్య పద్మజ 12వ వార్డు నుంచి పోటీ చేస్తుంది. వీరిద్దరు సైతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీ ఫారంతో బరిలో నిలిచారు. కాగా నాగన్న గతంలో 13 వార్డుసభ్యుడిగా పనిచేయగా, పద్మజ గతంలో  ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. వీరిరువురికి రాజకీయంగా ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇలా ఈ ఒక్క మునిసిపాల్టీలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్ద‌రు భ‌ర్త‌లు వారి భార్య‌లు కూడా పోటీలో ఉండ‌డం తో ఇక్క‌డ పోటీ అదిరిపోనుంది.

 

ఇక ఇదే జిల్లాలో నాగ‌ర్‌క‌ర్నూల్‌లో త‌ల్లి, కుమార్తె ఇద్ద‌రు కౌన్సెల‌ర్లు గా పోటీ ప‌డుతున్నారు. కుమార్తె అదే ప‌ట్ట‌ణానికి చెందిన యువ‌కుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్క‌డే కాపురం ఉంటోంది. దీంతో త‌ల్లి కాంగ్రెస్ నుంచి పోటీ ప‌డుతుంటే.. కుమార్తె టీఆర్ఎస్ త‌ర‌పున అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: