నిర్భయ దోషులను క్షమించమని కోరిన లాయర్‌ పై నిర్భయ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తెను దారుణంగా బలితీసుకున్న దోషులను క్షమించమని కోరేందుకు లాయర్ ఇందిరా జైసింగ్ ఎవరని, ఆమెకు ఎంత ధైర్యమని నిర్భయ తల్లి ప్రశ్నించారు.

 

నిర్భయ దోషులను క్షమించి వారికి ఉరిశిక్ష పడకుండా కాపాడాలని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా జైసింగ్ కు ఎంత ధైర్యం?  ఆమె ఇలాంటి సలహా ఇస్తుందంటే నమ్మలేకపోతున్నాను. ఆమెను సుప్రీంకోర్టులో నేను ఎన్నో సార్లు కలిశాను...ఏనాడు ఎలా ఉన్నావని అడగని ఆమె...ఈ రోజు దోషుల గురించి మాట్లాడుతుందని విరుచుకుపడ్డారు ఆశాదేవి. రేపిస్టులకు అండగా నిలిచే ఇలాంటి వాళ్లు ఉన్నంత వరకు ఈ దేశంలో రేప్ లు ఆగవని ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ దోషులను ఉరి తీయాలని దేశం మొత్తం కోరుకుంటోందన్నారు.

 

నిర్భయ దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించడంతో ఫిబ్రవరి 1న వారిని ఉరి తీయాలని నిర్ణయించారు. ఈ తరుణంలో మహిళా న్యాయవాది నిర్భయ తల్లిని దోషులను క్షమించాలని ట్విట్టర్ లో కోరారు. అంతేకాదు.., కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజీవ్గాంధీ హత్య కేసులో దోషి అయిన నళినిని ఆమె క్షమించారని ఈ సందర్భంగా ఇందిర గుర్తు చేశారు. ఈ విషయంలో ఆశాదేవి పెద్ద మనసు చేసుకోవాలని కోరారు. ఉరిశిక్షలకు మాత్రం తాము పూర్తి వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు.  దీనికి సమాధానంగా  నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించేవరకూ తనకు సంతృప్తి ఉండదని నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు. తన కూతురు కేసును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ దోషులను ఉరి తీయడంలో ఆలస్యం చేస్తున్నారని ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేతస్తుండగా ఇందిరా జైసింగ్ వ్యాఖ్యలు మరింత ఆగ్రహానికి గురి చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: