ఉగ్రవాదులతో అడ్డంగా దొరికిపోయిన జమ్ముకశ్మీర్ పోలీస్ అధికారి దవీందర్ సింగ్ కేసులో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. 
గతంలో కూడా దవీందర్ సింగ్ పై పలు ఆరోపణలు ఉన్న తరుణంలో.. అతడి గత చరిత్రను తవ్వే పనిలో పడింది. ఉగ్రవాదులతో ఉన్న లింకులపై పక్కా సాక్ష్యాలు సేకరించే దిశగా ఎన్ఐఏ విచారణ సాగనుంది. 

 

ఖాకీ ఉగ్రవాది,  జమ్మూకశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నెల 10వతేదీన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్లు నవీద్ బాబు, రఫీ అహ్మద్ రాథేర్, న్యాయవాది ఇర్ఫాన్ షఫీ మీర్ లను తన అధికారిక కారులో డీఎస్పీ దవీందర్ సింగ్ తరలిస్తుండగా.. జమ్మూకశ్మీర్ పోలీసులు పట్టుకున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకొని, వారికి సహకరించిన దవీందర్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జమ్మూకశ్మీర్ పోలీసులు కేసులు పెట్టారు.


 
యూఏపీఏ చట్టం సెక్షన్ల ప్రకారం దవీందర్ సింగ్ పై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేసేందుకు అతన్ని ఢిల్లీకి తరలించాలని నిర్ణయించారు. ఎన్ఐఏ ఫోరెన్సిక్ నిపుణుల బృందం దవీందర్ సింగ్ ఇంటి నుంచి ఏకే-47, హ్యాండ్ గ్రెనేడ్లు, పిస్టల్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీగా పనిచేస్తూ నమ్మక ద్రోహానికి పాల్పడి డబ్బు కోసం ఉగ్రవాదులకు సహకరించిన దవీందర్ కేసు దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏ అధికారులు స్వీకరించారు. 

 

కశ్మీర్ లోయ నుంచి ఉగ్రవాదులకు ఎస్కార్టుగా ఉండి తరలిస్తూ పట్టుబడిన దవీందర్ గతంలోనూ పలుసార్లు ఇలా చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.  దవీందర్‌కు ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు, పుల్వామా దాడి వెనుక దవీందర్ హస్తంపై కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

 

మనదేశానికి రక్షణ కవచంలా నిలవాల్సిన  పోలీస్ అధికారి దవీందర్ సింగ్ చీడపురుగులా తయారయ్యాడు. ఉగ్రవాదులకు మనదేశానికి సంబంధించిన విషయాలను చేరవేస్తూ.. తన నీచ బుద్దిని బయటపెట్టాడు. ఉగ్రవాదులతో అడ్డంగా దొరికిపోయిన ఈ ఖాకీ ఉగ్రవాది బండారం బయటపెట్టే పనిలో విచారణ బృందాలు నిమగ్నమయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: