భారత్ లో పెట్టుబడులు పెట్టాలని అన్ని దేశాలు తిరిగి చెబుతున్న ప్రధాని మోడీ.. మన దేశానికి వచ్చిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీనికి తోడు అమెజాన్ భారత్ ను ఉద్ధరించడానికి పెట్టుబడులు పెట్టడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీసిపారేశారు. అటు చిన్న వ్యాపారులు కూడా అమెజాన్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. ఆర్థిక సంస్కరణల తర్వాత ఓ ప్రపంచ కుబేరుడికి భారత్ లో నిరసన వ్యక్తం కావడం.. ఇదే తొలిసారి.

 

ప్రస్తుత ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్. ఈ-కామర్స్ రంగాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఘనత అమెజాన్ దే. ఏటా అమెజాన్ వ్యాపారంలో విపరీతమైన వృద్ధి చూపిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో అమెజాన్ ఎఫ్.డి.ఐ పాలసీకి విరుద్ధంగా నడుచుకుంటోందని, కొంతమంది వ్యాపారులతోనే ఒప్పందాలు చేసుకుంటోందని.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సీసీఐ కూడా అమెజాన్ పై విచారణకు ఆదేశించింది. భారత్ కు మూడు రోజుల పర్యటనకు వచ్చిన జెఫ్ బెజోస్ ఇది ఏ మాత్రం మింగుడు పడని పరిణామం. 

 

రాజకీయంగా కూడా అమెజాన్ కు చేదు అనుభవమే ఎదురైంది. జెఫ్ బెజోస్ ఇండియాలో మూడు రోజులు ఉన్నా.. ప్రధాని అపాయింట్ మెంట్ దక్కలేదు. సహజంగా దేశానికిక ఏ పెద్ద ఇన్వెస్టర్ వచ్చినా.. కేంద్రం రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతిస్తుంది. అలాంటిది అమెజాన్ సీఈవోను అస్సలు పట్టించుకోలేదు. పైగా భారత్ లో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని జెఫ్ బెజోస్ ప్రకటించిన తర్వాతి రోజే.. పీయూష్ గోయల్ అమెజాన్ గాలి తీసేశారు. భారత్ ను ఉద్ధరించడానికి పెట్టుబడులు పెట్టడం లేదని, వారి నష్టాలు పూడ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేసిన తర్వాత భారత్ ప్రభుత్వం ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తను ఇలా ట్రీట్ చేయడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. కానీ దీని వెనుక ఉన్న అసలు కోణం అందరిలో ఆసక్తి రేపుతోంది. 

 

జెఫ్ బెజోస్ అమెజాన్ అధిపతి. ఆయన సంస్థ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న చిన్నవ్యాపారులు కదం తొక్కారు. వీరికి ఆరెస్సెస్ అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా మద్దతు పలికింది. కానీ కేంద్రం వైఖరికి కారణం ఇది కాదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ రాసిన ఎడిటోరియళ్లు.. మోడీ ప్రభుత్వాన్ని చీకాకు పెట్టాయి. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు మీద కూడా ఈ పత్రికలో వ్యతిరేక కథనాలే వచ్చాయి. వాషింగ్టన్ పోస్ట్ కు కూడా యజమాని జెఫ్ బెజోసే. తమపై వ్యతిరేక వార్తలు వండి వారుస్తున్న పత్రిక యజమానికి.. తామెందుకు స్వాగతం పలకాలనేది మోడీ సర్కారు భావన. పీయూష్ గోయల్ మాటలతో వాస్తవం బోధపడ్డ జెఫ్ బెజోస్.. కేంద్రాన్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. 

 

21వ శతాబ్దం భారత్ దే నని ప్రకటించారు. డెమోక్రసీ, డైనమిజమ్, ఎనర్జీనే ఈ దేశ వనరులని కొనియాడారు. జెఫ్ బెజోస్ సంతకంతో కూడిన లేఖను అమెజాన్ విడుదల చేసింది. ఐదున్నర లక్షల చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉపయోగిస్తామని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ద్వారా పది బిలియన్ డాలర్ల విలువైన భారత్ లో తయారీ వస్తువుల్ని ప్రపంచ మార్కెట్లకు చేర్చడమే ధ్యేయమని ప్రకటించింది. కానీ ఈ లేఖ కూడా ప్రభుత్వంలో జెఫ్ బెజోస్ ఆశించిన మార్పును మాత్రం తీసుకురాలేకపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: