ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఇటీవల ముగిసిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరిరోజున ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రకటన చేసిందే తరువాయి ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియపై వేగంగా ముందుకెళ్లింది. జి‌ఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీలు ఏర్పాటు చేసి దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ మూడు కమిటీలు కూడా సీఎం ప్రకటన చేసిన విధంగానే నివేదికలు సమర్పించాయి.

 

ఈ క్రమంలోనే ఈ మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో కూడా ప్రవేశ పెట్టి, అక్కడ కూడా ఆమోద ముద్రవేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశ పెట్టనుంది. ఇక దీనికంటే ముందు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి..బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెడితే ఆమోద ముద్రపడటం పెద్ద విషయమేమి కాదు.

 

శాసనసభలో వైసీపీకి అదిరిపోయే మెజారిటీ ఉంది. 151 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది. అలాగే ఇద్దరు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా మద్ధతు ఇవ్వడం ఖాయం. అయితే ఈ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ ఈ బిల్లుకు మద్ధతు ఇవ్వదు. ఈ బిల్లుని ఎలాగోలా అడ్డుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఆ మేరకు చంద్రబాబు వ్యూహాలు కూడా రచిస్తున్నారు. శాసనసభలో ఎలాగో బలం లేదు కాబట్టి..ఈ బిల్లుని తమకు బలం ఉన్న శాసనమండలిలో అడ్డుకోవాలని అనుకుంటుంది.

 

అలాగే అమరావతికి సంబంధించి ప్రైవేట్ బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. అటు సి‌ఆర్‌డి‌ఏ రద్దు బిల్లుపై కూడా టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లనుంది. ఇక ఈ బిల్లులపై వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ అధిస్థానం తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు విప్ కూడా జారీ చేసింది. అటు రెబల్ ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేసింది. ఒకవేళ విప్ ఎవరైనా ధిక్కరిస్తే అనర్హత వేటు వేయడానికి టీడీపీకి అవకాశం దొరుకుతుంది. మరి చూడాలి టీడీపీ వ్యూహాలు ఏ మేర ఫలిస్తాయో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: