కొత్త సంవ‌త్స‌రంలో తెలుగు వారికి ఓ షాక్ త‌గ‌ల‌డం ఖాయం క‌నిపిస్తోంది. దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్రంలోని అధికార బీజేపీ ద్వారా ఈ షాక్ ఖాయ‌మంటున్నారు. ఢిల్లీ పెద్ద‌లు తెలుగు వారిని నిరాశకు గురి చేసే నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని...ఇందుకు సంబంధించిన క‌స‌ర‌త్తు ఇప్ప‌టికే పూర్త‌యిపోయి...అధికారిక ప్ర‌క్రియ మాత్ర‌మే మిగిలి ఉంద‌నే వార్త‌లు జాతీయ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అదే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఉద్వాస‌న ప‌ల‌కడం. ఆమె స్థానంలో కొత్త వ్య‌క్తిని తీసుకురావ‌డం.

 

తెలుగింటి కోడ‌లు అయిన నిర్మ‌లా సీతారామ‌న్‌ పనితీరుపై దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో బ్రిక్స్‌ కూటమి (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) బ్యాంక్‌ చైర్మన్‌గా పనిచేస్తున్న కేవీ కామత్‌కు ఆర్థిక శాఖ అప్పగిస్తారని సమాచారం. కేంద్రంలోని ఉన్నతస్థాయి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ‘బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా’ (బ్రిక్స్‌) కూటమి బ్యాంక్‌ చైర్మన్‌ కేవీ కామత్‌ కేంద్ర మంత్రివర్గంలో చేరుతారని, ఆయనకు ఆర్థిక శాఖను అప్పగిస్తారని తెలిసింది. ఆర్థిక శాఖ‌ను మ‌రింత స‌మర్థ‌వంతంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌ధాని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

 


మరోవైపు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల తీవ్ర విమర్శల‌ను ఎదుర్కుంటోంది. ఆ మంత్రిత్వ శాఖపై మోదీ జరిపే సమీక్షలో ఆ శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడంపైనే ఆయన భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.  గతంలో రైల్వే, వాణిజ్య శాఖల మంత్రిగా పనిచేసిన సురేశ్‌ప్రభు మళ్లీ మోదీ మంత్రివర్గంలో చేరుతారని సమాచారం. కాగా, మంత్రివర్గంలో చేరే కొత్త ముఖాలలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు స్వపన్‌ దాస్‌ గుప్తా పేరు కూడా ఉన్నట్టు సమాచారం. స్వపన్‌దాస్‌ గుప్తాకు కూడా మానవ వనరుల అభివృద్ధి శాఖలో సహాయ మంత్రి బాధ్యతలు అప్పగిస్తారని పేర్కొన్నాయి. దక్షిణ భారతానికి చెందిన మరో సాంకేతిక నిపుణునికి, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌కు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించవచ్చని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: