తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏపీలో పాగా వేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కనీసం నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోలేకపోయిన కూడా ఏపీని సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే పలువురు టీడీపీ నేతలనీ సైతం పార్టీలో చేర్చుకుని ముందుకెళ్లింది. అయితే ఎంత వలసలు వచ్చిన ఏపీలో బీజేపీ పరిస్తితి దారుణమే. ఏదో పార్టీలో నాయకులు ఉన్నారు తప్ప...ప్రజల్లో మాత్రం బలంగా లేదు.

 

ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యూహాత్మకంగా జనసేనతో ముందుకెళ్లడానికి సిద్ధమైంది. ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న జనసేన కూడా బీజేపీతో కలిసి పయనించేందుకు రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ  బీజేపీతో కలవడం వల్ల పవన్‌కు ఎంత ఉపయోగం ఉందో తెలియదుగానీ...పవన్‌తో కలవడం వెనుక బీజేపీ పెద్ద వ్యూహమే రచించినట్లు కనబడుతుంది. మామూలుగా ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. అందులోనూ కమ్మ, రెడ్డి కులాల మధ్యే రాజకీయం ఎక్కువగా ఉంటుంది.

 

టీడీపీలో కమ్మ కులం డామినేషన్ ఎక్కువ ఉంటే, వైసీపీకు రెడ్డి కులం అండగా ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఎక్కువ స్థాయిలో ఉన్న కాపు సామాజికవర్గానికి మాత్రం సరైన ప్రాతినిధ్యం లేదు. ఒకప్పుడు ప్రజారాజ్యంతో అండ దొరికిన తర్వాత అది కనుమరుగైంది. ఇక ఇప్పుడు జనసేన ద్వారా బండి లాగాలని కాపులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేనతో కలవడం ద్వారా కాపు సామాజికవర్గం మద్ధతు పొందాలని బీజేపీ వ్యూహం రచించింది.

 

దేశంలో మతం కార్డు ఉపయోగించి లబ్ది పొందుతున్న బీజేపీ...ఇప్పుడు ఏపీలో కులం కార్డు ద్వారా ముందుకెళ్లాలని అనుకుంటుంది. అందుకు జనసేనని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కలయిక వల్ల ఇప్పటికిప్పుడు లాభం లేకపోయిన, 2024 ఎన్నికలకొచ్చేసరికి ఫలితం రాబట్టాలని ప్రయత్నం చేస్తోంది. చూడాలి మరి అసలు వీరి పొత్తు ఎంతకాలం సాగుతుంది? కాపులు బీజేపీకి ఏ మేర జై కొడతారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: