హస్తిన అసెంబ్లీ పోరు రసవత్తరంగా సాగుతోంది. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. అయితే... ఆప్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్‌.  పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు పెట్టి ఢిల్లీలో ఆప్‌ కోటను కూలగొట్టాలని పట్టుదలగా ఉంది బీజేపీ. మరోవైపు... ఆర్జేడీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ హస్తినను హస్తగతం చేసుకోడానికి గట్టి నేతల్ని బరిలోకి దించుతోంది.

 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని శక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి పార్టీలు.  అధికారాన్ని చేజార్చుకోకుడదని పట్టుదలగా ఉంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ఎన్నికల ప్రకటన రావడమే ఆలస్యమన్నట్టు 70 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్‌ 54 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో ఆప్‌ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లోకి వచ్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆల్క లంబాతో పాటు మాజీ మంత్రి అర్విందర్‌ సింగ్‌ లవ్‌లీ, అశోక్‌ వాలియా తదితరులు ఉన్నారు. చాందినీ చౌక్‌ నుంచి పోటీ చేస్తున్నారు ఆల్క లంబా. మరో 12 మంది అభ్యర్థుల్ని త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి. పొత్తులో భాగంగా నాలుగు సీట్లను ఆర్జేడీ కేటాయించింది కాంగ్రెస్‌. 42 మందితో బహుజన్‌ సమాజ్‌ పార్టీ తొలి జాబితా ప్రకటించింది. 

 
 ఢిల్లీ మళ్లీ కాంగ్రెస్‌దే నినాదంతో హస్తం పార్టీ ప్రచారం చేస్తోంది. సీఎంగా శీలాదీక్షిత్‌ నాయకత్వంలో 15 ఏళ్ల పాటు ఢిల్లీని ఏలిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ నినాదం ఎత్తుకుంది కాంగ్రెస్‌. మరోవైపు... అచ్చే బిటే పాంచ్‌ సాల్‌... లగే రహో కేజ్రీవాల్‌ అంటోంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ఈ సారి కూడా సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న కేజీవ్రాల్‌... న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే... ఇటు కాంగ్రెస్‌ గాని, అటు బీజేపీ గాని అక్కడ అభ్యర్ధిని ఖారారు చేయలేదు. అలాగే, తమ సీఎం అభ్యర్థులెవరన్నది కూడా చెప్పలేదు. 

 

57 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన బీజేపీ... ప్రచారంలో దూసుకెళ్లేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. 5 వేల బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు కమలనాథులు. రోజుకు 250 చొప్పున వచ్చే 20 రోజుల్లో ఈ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. జనంతో మమేకమయ్యేలా ఈ సభలు నిర్వహించాలనేది అధినాయకత్వం ఆదేశం. ఈ క్రమంలో ఒక్కో సభకు 200 మందికి మించి జనం హాజరుకాకుండా చూసుకోవాలని సూచించినట్టు సమాచారం. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వంద మంది బీజేపీ అగ్రనేతలు పాల్గోనున్నారు. వీళ్లలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు సీనియర్‌ కేంద్ర మంత్రుల్ని ఉంటారు. అయితే, ఎవరెవరు... ఎప్పుడు? ఎక్కడ? ప్రచారం చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: