గ్రేటర్  విశాఖ నగరంలో సరిహద్దుల వివాదం రాజుకుంది. జీవీఎంసీ  చేపట్టిన వార్డుల పునర్విభజనపై తీవ్రస్ధాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్ పీఠం కోసం అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోందని టీడీపీ ఫిర్యాదు చేసింది. అయితే...గీతలు మారినంత మాత్రాన రాతలు మారిపోవని....జీవీఎంసీ గెలుపు తమదేనని అధికార వైసీపీ అంటోంది.

 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖపట్టణం. దీని ఖ్యాతి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ప్రతిపాదనలతో మరింత పెరిగిపోయింది. ఐదు గ్రామాల విలీనం తర్వాత భీమునిపట్టణం, అనకాపల్లిని కలుపుకుంటూ విశాఖ జంబో గ్రేటర్ నగరంగా ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్యను 72 నుంచి 98కి పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2011 జనాభా ప్రాతిపదికన నూతన వార్డులను రూపొందించారు. దీనికి సంబంధించిన ముసాయిదాను జీవీఎంసీ విడుదల చేసింది. ఐతే, వార్డుల పునర్విభజనపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల ప్రమేయంతో సరిహద్దులను రూపొందించారని టీడీపీ ఆరోపిస్తోంది. వాస్తవానికి రాజకీయంగా కీలకమైన జీవీఎంసీపై పట్టు సాధించడం ప్రతిపక్షం కంటే అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. సార్వ త్రిక ఎన్నికల్లో నగరం పరిధిలో నాలుగు అసెంబ్లీ స్ధానాలను వైసీపీ కోల్పోయింది. గ్రేటర్‌పై వైసీపీ జెండా ఎగరేయాలని నాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది. 

 

కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదన, సంక్షేమ పథకాలు... తమ పార్టీకి లబ్ధి చేకూరుస్తాయని అధికార పార్టీ అంచనా. ఇలాంటి తరుణంలో ఎన్నికలు జరిగితే కచ్చితంగా మేయర్‌ పదవిని దక్కించుకోవచ్చునని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అలా కాకుండా పొరపాటున మేయర్‌ పదవి చేజారిపోతే పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాకముందే రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌లో ఓటమి పాలైందనే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఈ కారణాలతోనే వార్డుల పునర్విభజనలో రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తమకు అనుకూలమైన వార్డులను చిన్నవిగానూ....వ్యతిరేకత ఉన్న వార్డుల పరిధిని పెద్దదిగానూ రూపొందించారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈమేరకు జీవీఎంసీ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది టీడీపీ ప్రతినిధుల బృందం. నగరంలో నలుగురు ఎమ్మెల్యేలు, అర్బన్ ఓటర్ సపోర్ట్ ఉన్నందున జీవీఎంసీ గెలిచి తీరుతామని టీడీపీ నేతలు అంటున్నారు. వార్డుల విభజన విషయంలో సరిహద్దులను అధికారపార్టీకి అనుకూలంగా రూపొందించారని టీడీపీ మండిపడుతోంది. ఇప్పటికే వైసీపీకి ఎన్నికల భయం పట్టుకుందని విమర్శిస్తున్నారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.

 

మరోవైపు...గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక కసరత్తు ప్రారంభించిన వైసీపీ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతోంది. సరిహద్దుల కారణంగా గెలుపు ఓటములు ఎలా నిర్ణయం అయిపోతాయని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. గీతలు మారినంత మాత్రన రాజకీయాల్లో రాతలు మారిపోవంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్. ఏడు నెలలుగా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమమే గీటురాయిగా గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

మొత్తానికి...తాత్కాలికంగా ఎన్నికలకు బ్రేక్ పడినా....గ్రేటర్ విశాఖలో వార్డుల సరిహద్దుల సాక్షిగా రాజకీయం మాత్రం హాట్‌హాట్‌గా మారే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: