ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు అయోమయంలో ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఒకటే ఉంటుందా లేదంటే మూడు రాజధానులు ఉంటాయా అనే సందిగ్ధంలో పడిపోయారు.  మూడు రాజధానులు ఉంటాయని, మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైకాపా భావిస్తుంటే, ఒక్కటే రాజధాని ముద్దు అని ప్రతిపక్షాలు అంటున్నాయి.  దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం, మిగతా ప్రతిపక్షాలు ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేస్తున్నారు.  


ఈనెల 20 వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  మరోవైపు రాజదాని ప్రాంతంలో నిరసనలకు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు.  ర్యాలీ చేస్తే అడ్డుకుంటామని పోలీసులు అంటున్నారు.  ఇక ఇదిలా ఉంటె, మూడు రాజధానులు మద్దతుగా ఈరోజు విజయవాడలో భారీ ర్యాలీని నిర్వహించారు.  


ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైకాపా కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.  మూడు రాజధానులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అంటున్నారు.  మూడు రాజధానుల అంశం ఆహ్వానించదగిన అంశం అని చెప్తున్నారు.  రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు మూడు రాజధానులకే ఓటు వేస్తున్నారని, జగన్ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని అంటున్నారు.  


చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ప్రజల్లోకి తప్పుడు ఆలోచనలు తీసుకెళ్లి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైకాపా నేతలు అంటున్నారు.  ఇప్పుడు బాబును ఎవరూ నమ్మడం లేదని, ప్రజలు గతంలో అధికారం అందిస్తే రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చేశారని నేతలు విమర్శిస్తున్నారు.  జగన్ చెప్పినట్టుగా మూడు రాజధానులతో మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు.  ఎవరి వెర్షన్ తో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ ప్రజా పోరాటంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది ప్రజలే నిర్ణయించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: