సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసి ఆరు నెలలు తిరగకుండానే శ్రీకాకుళంలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఆశావాహులందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయారు. అయితే పొలిటికల్ పార్టీల ఆశలపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు నీళ్లుచల్లాయి. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ గ్యారంటీ అనుకున్నవారంతా తాజా పరిణామాలతో డీలా పడిపోయారు. 

 

శ్రీకాకుళంలో స్థానిక ఎన్నికల సమరానికి వ్యూహరచన చేసుకుంటున్న రాజకీయపార్టీలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో దిమ్మతిరిగింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి, స్థానిక రిజర్వేషన్స్ కూడా ఖరారు చేసింది ప్రభుత్వం. తాము ఎన్నికలకు రెడీ అని ప్రకటించి పదిరోజులు కూడా కాకుండానే రిజర్వేషన్ల పై పలువురు కోర్టు తలుపు తట్టారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఉన్న అన్ని కేసులను పరిష్కరించుకుని ఓ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. దీనికోసం నాలుగువారాల గడువు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో శ్రీకాకుళంలోని అధికారపక్షం ఆశలు ఆవిరైపోయాయి. 

 

లోకల్ బాడీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోనెం 176ను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం జనవరి 10న జిల్లాల వారీగా జడ్పీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి తుదిజాబితాను రూపొందించింది. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. అటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని ఇప్పటికే మంజూరు చేసింది ఏపీ సర్కారు.  బ్యాలెట్ల ముద్రణకు టెండర్ల ప్రక్రియపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇదిలా ఉంటే గతంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్లకు బదులు ఈసారి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇదే ప్రస్తుతం  స్థానిక ఎన్నికలకు అడ్డుగా మారింది. 

 

ఇక జిల్లాలోని 675 ఎంపీటీసీల రిజర్వేషన్లలో మహిళలకు 326, జనరల్‌కు 349 స్థానాలు కేటాయించారు. వీటిలో ఎస్టీలకు 44, ఎస్సీలకు 65, బీసీ 390, అన్ రిజర్వుడుగా 176 స్థానాలు ఖరారు చేసింది ప్రభుత్వం. ఇక జడ్పీటీసీకి సంబంధించి జిల్లాలోని మొత్తం 38 స్థానాల్లో సగం.. అంటే 19 స్థానాలు మహిళలకు, మిగిలినవి జనరల్‌కు కేటాయించారు. ఇదంతా ఒకెత్తయితే ఇప్పటికే జిల్లాపరిషత్ ఛైర్ పర్సన్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు అధికార పార్టీ నేతలు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలకు మళ్లీ పాతపద్ధతిలోనే 50 శాతం రిజర్వేషన్లు ఖరారు అయితే... ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోననే ఆందోళనలో ఉన్నారు. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్షాలకంటే...అధికారపార్టీలోనే ఎక్కువ కలవరాన్ని పుట్టిస్తున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: