ఆయ‌నో ఎంపీ. యువ‌నేత‌గా సుప్రసిద్ధుడు. చిన్న‌వ‌య‌సులోనే ఎంపీగా గెలుపొందారు. ఏకంగా ఆరుసార్లు బీజేపీ ముఖ్య‌నేత గెలుపొందిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న్ను కాద‌ని టికెట్ ద‌క్కించుకున్న స‌మ‌ర్థుడు. అదే ఊపుతో గెలుపొంది త‌న స‌త్తా చాటుకున్న యువ‌నేత‌ ఆయ‌నే కర్ణాటకలోని బెంగళూరు సౌత్‌ ఎంపీ తేజస్వి సూర్య. బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుందా అనే ప్రచారం  జ‌రుగుతున్న త‌రుణంలో... జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటుగా ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌లిసి ఈ పొత్తు డీల్‌లో కీల‌క పాత్ర పోషించారు. అయితే, తాజాగా ఆయ‌న్ను లేపేసే అంశం వెలుగులోకి వ‌చ్చి క‌ల‌కలం సృష్టిస్తోంది.

 

సౌత్‌ బెంగళూరు ఎంపీ, నిత్యం వార్త‌ల్లో నిలిచే తేజస్వీ సూర్య హత్యకు కుట్ర జ‌రిగింద‌ని తేలింది. సీఏఏకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొని ఇంటికి వెళుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తపై దాడి చేసిన వారిని విచారించ‌గా ఈ కుట్రకోణం బయటపడింది. ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు యువ బ్రిగేడ్‌ నేత చక్రవర్తి సూలిబెలెను హతమార్చేందుకు కుట్ర పన్నినట్టు ఆరుగురు నిందితులు పోలీసులకు తెలిపారు.

 

కాగా, ప‌వ‌న్‌తో తేజ‌స్వీ సూర్య‌కు ప్ర‌త్యేక దోస్తీ ఉంది. ప‌వ‌న్ ఈ జ‌న‌వ‌రి మొద‌టి వారంలో బెంగ‌ళూరు వెళ్ల‌గా ప్ర‌త్యేకంగా ఎంపీ తేజ‌స్వి ఆయ‌నతో స‌మావేశం అయ్యారు. జనసేనానితో బీజేపీకి చెందిన ఇద్దరు యువ ఎంపీలు కలిశారు. కర్ణాటకలోని బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా. అనంత‌రం మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా.. పవన్ కళ్యాణ్‌తో కలిసిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘నేను ఆయన(పవన్ కళ్యాణ్) సినిమాలను చూసేవాణ్ని. కాలేజీ రోజుల్లో ఆయన్నెంతగానో అభిమానించేవాణ్ని. ఈ రోజు నేను, తేజస్వి సూర్య ఆయన్ను కలిసి మాట్లాడే అవకాశం లభించింది. థాంక్యూ పవన్ కళ్యాణ్ సర్, విశ్వ గారూ' అని ప్రతాప్ సింహా ట్వీట్ చేశారు. కాగా, బీజేపీ పెద్ద‌ల‌తో పొత్తు స‌మావేశంలోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటుగా తేజ‌స్వి సూర్య ఉన్నారు. ఇలా తెలుగు వారికి సుప‌రిచిత‌మైన ఎంపీపై హ‌త్యాయ‌త్నం జ‌ర‌గ‌డం సంచ‌ల‌నంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: