జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విశాఖపట్నం  కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పల్రాజు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మండిప‌డ్డారు. రాజ‌ధాని విష‌యంలో ఈ ఇద్ద‌రు నేత‌లు కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాదిలా మారిపోయారని మండిప‌డ్డారు. తన పాలనలో తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని సీదిరి అప్ప‌ల్రాజు ఆరోపించారు.

 


చంద్రబాబును ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌జ‌లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బుధ్ది రాలేదని, ఇప్ప‌టికీ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని అప్ప‌ల్రాజు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు. చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానాలు కలుగుతున్నాయని ఆయ‌న వ్యాఖ్యానించారు. విద్యార్ధులు ఉన్నత స్థితికి వెళ్లాలంటే ఇంగ్లీషు తప్పనిసరి అని పేర్కొన్న  అప్ప‌ల్రాజు... ఇంగ్లీషు మీడియం ప్ర‌వేశ‌పెట్టడాన్ని అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లి కుట్రలు పన్నుతున్నార‌ని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ చేసిన హడావుడి అందరికి తెలుసన‌ని అప్ప‌ల్రాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ర్టంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నార‌ని, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. హీరోగా కంటే విలన్‌గానే పవన్ కల్యాణ్ బాగా నటిస్తున్నారని అప్ప‌ల్రాజు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ప్రజల అవసరాలను గుర్తించడం లేదని ఆరోపించారు. రాష్ర్ట సమగ్ర అభివృధ్దికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషి చేస్తున్నారని అప్ప‌ల్రాజు వ్యాఖ్యానించారు.

 

 


కాగా విశాఖలో మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను స్వాగతిస్తూ వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...చంద్ర‌బాబుకు త‌న అసలు పుత్రుడు పనికిరాడని.. దత్తపుత్రుడిని రంగంలోకి దించారంటూ సెటైర్లు వేశారు. ఓట్ల కోసం గాజువాక... రాజకీయాల కోసం అమరావతి కావాల్సి వచ్చిందా? అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. గాజువాక ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: