ప్రిన్స్‌ హారీ, మేఘన్‌ దంపతులు బ్రిటన్‌ రాజ కుటుంబానికి త్వరలోనే దూరం కానున్నారు. బ్రిటన్‌ రాణి ప్రతినిధులుగా ఎంతో కాలం ఉండబోరని బకింగ్‌ హమ్‌ ప్యాలెస్‌ స్పష్టం చేసింది. కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది ప్యాలెస్‌. 

 

రాచరికానికి దూరంగా... స్వతంత్రంగా జీవించాలనుకుంటున్న ప్రిన్స్‌ హారీ, మేఘన్‌ దంపతుల కోరికకు ఆమోద ముద్రపడింది. దీనికి సంబంధించి ఓ ఒప్పందం కూడా కుదిరింది. ఏప్రిల్‌ తర్వాత ఈ ఒప్పందం అమల్లోకి రానుంది.

 

రాజ కుటుంబం నుంచి హారీ, మేఘన్‌ దంపతులు నిష్క్రమణకు సంబంధించి బకింగ్‌ హమ్‌ ప్యాలెస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అనేక నెలల మాటలు... తాజా చర్చల తర్వాత నా మనువడు, అతని కుటుంబానికి అండగా ఉండాలని సమష్టిగా నిర్ణయించినట్టు రాణి స్పష్టం చేశారు. గత రెండేళ్లలో హారీ, మేఘన్‌ ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకుని... రాజ కుటుంబం నుంచి విడిపోయి జీవించాలన్న వాళ్ల కోరికను సమర్థించినట్టు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా వాళ్లు ప్రశాంతమైన, ఆనందమయ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం ఏర్పడిందని స్పష్టం చేశారు రాణి. 

 

కాగా, ఒప్పందంలో భాగంగా, బ్రిటన్‌లో తాము నివసించే ఫ్రాగ్‌మోర్‌ కాటేజికి 2.4 మిలియన్‌ పౌండ్లు చెల్లించేందుకు అంగీకరించారు హారీ, మేఘన్‌ దంపతులు. రాజకుటుంబాన్ని ఎవరూ వదులుకోరు. ఎందుకంటే ఆ మర్యాదలు వేరే చెప్పాల్సిన పనిలేదు. చిటికేస్తే కళ్లముందు పనోళ్లు.. కావాల్సింది కోరుకోగానే ప్రత్యక్షమయ్యే సదుపాయాలు ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. కానీ ఆ రాజకుటుంబాన్ని విడిచి హ్యారీ, మేఘన్ దూరంగా వెళ్లాలనుకుంటున్నారు. సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. వాళ్ల  విచిత్ర కోరికకు పెద్దలు కూడా ఒకే చెప్పినట్టు తెలిసింది. ఇంకేముందీ ప్రిన్స్, హ్యారీ రాజకుటుంబం నుంచి బయటకు అడుగుపెట్టబోతున్నారు. ప్రజల్లో ఒకరిలా మెలగబోతున్నారు. చూడాలి సాధారణ జీవితాన్ని కోరుకుంటున్న వాళ్లు.. అందులో ఇమడగలుగుతారో లేదో. 

మరింత సమాచారం తెలుసుకోండి: