అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు వీలు లేదంటూ రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.  రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అటు ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలుపుతుండటంతో ఆందోళనలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.  కాగా, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఆందోళన మరింత ఎక్కువైంది.  రేపు జరగబోయే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడానికి రాజధాని రైతులు సమాయత్తం అవుతున్నారు.  

 


అటు రాజకీయ పార్టీలు కూడా వీరికి మద్దతు తెలుపుతున్నాయి.  ఈనెల 21 వ తేదీన మండలిలో ఈ బిల్లును అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా పట్టుబడుతున్నది.  దీనికోసం ఈరోజు ఆ పార్టీ టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసింది.  ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.  విజయవాడలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

 


పార్టీ సమావేశానికి విశాఖ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.  వీరితో పాటుగా 12 మంది ఎమ్మెల్సీలు కూడా హాజరు కాకపోవడంతో పార్టీ ఆందోళన చెందుతున్నది.  ఎందుకు హాజరు కాలేకపోయారు అనే విషయం మాత్రం తెలియడం లేదు.  అయితే, పార్టీ మాత్రం వ్యక్తిగత కారణాల వలనే హాజరుకాలేదని, ఈనెల 21 వ తేదీన జరిగే సమావేశాలకు తప్పకుండా హాజరవుతారని అంటున్నారు.  

 


ఈ సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆ పార్టీలో తెలియని భయం పట్టుకున్నది.  ఒకవేళ ఈ 12 మంది మండలికి హాజరు కాకపోతే, మెజారిటీ తగ్గిపోతుంది.  మెజారిటీ తగ్గిపోతే, విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని మార్చే అవకాశం అధికార పార్టీకి ఇచ్చినట్టు అవుతుంది. దీని గురించే ఇప్పుడు అందరు ఆందోళన చెందుతున్నారు.  మండలిలో కూడా బిల్లు పాసైతే తెలుగుదేశం పార్టీకి అది పెద్ద దెబ్బతగిలినట్టు అవుతుంది.  మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: