ఏపీలో క్యాపిటల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు జరిగే కీలకమైన అసెంబ్లీ సమావేశంపైనే అందరి కళ్లూ ఉన్నాయి. సభలో మూడు రాజధానుల బిల్లు నెగ్గించుకోవాలని వైసీపీ చూస్తుంటే.. అసలు అసెంబ్లీనే జరగకుండా చూడాలని టీడీపీ వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునివ్వగా.. ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులిచ్చారు. 

 

ఇప్పటికే అన్ని కమిటీలు పరిపాలన వికేంద్రీకరణకు మొగ్గు చూపడంతో.. ఏపీ సర్కారు వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే సోమవారం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్.. సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గనతో చర్చించారు. సీఆర్డీఏ బిల్లును మనీ బిల్లుగా ప్రవేశపెట్టాలని కూడా దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో బిల్లుకు అడ్డంకి లేకపోయినా.. మండలిలో టీడీపీకి బలం ఉంది కాబట్టి.. ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. మనీ బిల్లును తిప్పి పంపే అధికారం మండలికి లేకపోవడంతో.. తప్పనిసరిగా ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటుంది. అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రిపేరయింది. అమరావతి రైతుల్ని కూల్ చేయడానికి చంద్రబాబు కంటే మరింత మెరుగైన ప్యాకేజ్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామని జగన్ అసెంబ్లీలో ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా వైసీపీ నేతల ఆధ్వర్యంలో విశాఖ, విజయవాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ర్యాలీలు జరిగాయి. 

 

ఇక టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుంచి దేన్నీ తరలించనివ్వబోమని ఆందోళన చేస్తోంది. అమరావతి జేఏసీతో కలిసి వ్యూహరచన చేసింది. అసెంబ్లీ ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల ప్రజలు అమరావతి అసెంబ్లీకి తరలిరావాలని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. అటు మహిళలు ఇప్పటికే దుర్గగుడికి పాదయాత్రగా వెళ్లారు. 29 గ్రామాల ప్రజలు వరుసగా 33వ రోజు కూడా ఆందోళనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని తరలింపును అడ్డుకుంటామని వాళ్లు గట్టిగా చెబుతున్నారు. టీడీపీ కూడా సభ జరగనీయకూడదని ప్లాన్లు గీస్తోంది. ప్రభుత్వాన్ని నైతికంగా దెబ్బకొట్టేలా నేతల ప్రసంగాలు ఉండాలని చూస్తోంది. అధికార పార్టీ ఇప్పటివరకు ఆలోచించని అంశాలను తెరపైకి తెచ్చి.. వైసీపీ నేతల్ని ఇరుకునపెట్టాలనే వ్యూహం కూడా ఉంది. అయితే సర్కారు మనీ బిల్లును తెస్తే.. టీడీపీకి ఆప్షన్స్ ఏమీ ఉండవనే వాదన ఉంది. టీడీఎల్పీ సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అటు టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడంతో.. రెబల్స్ గా మారిన వంశీ, మద్దాలి గిరి సభకు గైర్హాజరు అయ్యే అవకాశాలున్నాయి.

 

పోలీసులు కూడా ముందస్తు ఏర్పాట్లలో ఉన్నారు. రేపు సజావుగా అసెంబ్లీ జరగడానికి అన్ని మార్గాలూ అన్వేషిస్తున్నారు. ఇప్పటికే సీఎం ఇంటి నుంచి అసెంబ్లీకి ట్రయల్ రన్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సేఫ్ గా అసెంబ్లీ చేరేలా భద్రత ఏర్పాట్లు ఉంటాయంటున్నారు. వందలాది మంది జేఏసీ సభ్యులకు, టీడీపీ నేతలకు ఇప్పటికే నోటీసులిచ్చారు. ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అందరూ రూల్స్ ను గౌరవించాలని, నిబంధనలు అతిక్రమిస్తే తర్వాతి జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. హౌస్ అరెస్టులు కూడా ఉంటాయని చెబుతున్నారు. అర్థరాత్రి నుంచే అరెస్టులు కూడా ఉండే అవకాశాన్ని ఎవరూ తోసిపుచ్చడం లేదు. 

 

లాయర్లు కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి బెజవాడ బార్ అసోసియేషన్ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత అఖిలపక్ష రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా జరిగింది. రాజధాని అమరావతిలోనే ఉండాలని అందరూ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: