ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చని కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ కావచ్చని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అధికారికంగా కర్నూలులో హైకోర్టు గురించి ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ కర్నూలు వాసులు సీఎం జగన్ చేసిన ప్రకటన నేపథ్యంలో కర్నూలుకు హైకోర్టు వస్తుందని విశ్వసిస్తున్నారు. కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ నిర్మాణం ఎక్కడ జరుగుతుందనే ప్రశ్నకు ఓర్వకల్లులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు కావచ్చని తెలుస్తోంది.     
 
ఓర్వకల్ దగ్గర ఏపీ ప్రభుత్వానికి వేల ఎకరాల భూములు ఉన్నాయి. దాదాపుగా ఓర్వకల్ లో ఎయిర్ పోర్టుకు సంబంధించిన పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. స్టీల్ ఇండస్ట్రీ, రాక్ గార్డెన్స్, ఉర్దూ యూనివర్సిటీ, సోలార్ ప్రాజెక్ట్, డీఆర్డీవో, హెల్త్ సిటీ, ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లుకు సమీపంలో కేంద్రీకృతమై ఉన్నాయి. అందువలన ప్రభుత్వం జ్యుడీషియల్ క్యాపిటల్ నిర్మాణం ఇక్కడే చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
మరో శ్రీ సిటీలా ఓర్వకల్లు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. రోడ్డు, రైలు, వాయు మార్గాలకు అందుబాటులో ఉన్న ప్రాంతం ఓర్వకల్లు కావడంతో ఇక్కడే హైకోర్టు ఏర్పాటు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. కర్నూలుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్వకల్లులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 
 
రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలకు నీటి సరఫరా కూడా ఇదే ప్రాంతం నుండి వెళుతూ ఉండటంతో నీటిని నిల్వ చేసుకోవటానికి కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. సీఎం జగన్ అసెంబ్లీలో అధికారికంగా ఈ విషయం గురించి ప్రకటన చేయాల్సి ఉంది. సీఎం జగన్ ప్రకటన తరువాత ఈ విషయం గురించి స్పష్టత రానుంది. కర్నూలుకు హైకోర్టు వచ్చే అవకాశాలు ఉండటంపై కర్నూలుజిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: