తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని రీతిలో సొంత పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల నుంచే షాకులు త‌గులుతున్నాయి. కీల‌క‌మైన ఏపీ రాజ‌ధాని విష‌యంలో చంద్ర‌బాబు ఇరుకున ప‌డిపోతున్నారు. గత నెల రోజులుగా అమరావతి ప‌రిధిలో రాజధాని ఆందోళనలు జ‌రుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు అమరావతి ఏరియా ప్రజలకు అండగా ఉద్యమంతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే, ఈ విష‌యంలో ప్ర‌భుత్వాన్ని ఢీకొట్టాల‌ని చంద్ర‌బాబు భావిస్తే...ఆయ‌న‌కు షాకిచ్చారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు. ఆదివారం విజయవాడలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన టీడీఎల్పీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దూరంగా ఉండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

 


రాజధాని అంశంపై టీడీపీ వాద‌న‌లో ఇప్ప‌టికే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పటికే విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు.. విశాఖను ఎగ్జిక్యూటివ్‌గా క్యాపిటల్‌గా స్వాగతిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వారు ఓ తీర్మానాన్ని కూడా పార్టీ అధిష్టానానికి పంపారు. దీంతో అసెంబ్లీ స‌మావేశాల్లో ఎమ్మెల్యేలు పార్టీ గీత దాట‌కుండా ఉండేందుకు తెలుగుదేశం విప్ జారీచేసింది. శాస‌న‌స‌భా స‌మావేశాల‌కు హాజ‌రై పార్టీ ఆదేశాల‌కు అనుగుణంగా ఓటు వేయాల‌ని పార్టీ విప్ డీవీబీ స్వామి స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యేలు దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా పేర్కొన్నారు.

 

అయితే, ఈ విప్ గురించి మీడియాలో వెల్ల‌డించిన అనంత‌రం నిర్వ‌హించిన టీడీఎల్పీ స‌మావేశానికి ఎమ్మెల్యేలు హాజ‌రుకాలేదు. పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు, 32 మంది ఎమ్మెల్సీల్లో 12 మంది ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. పార్టీ సీనియ‌ర్ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌, బి అశోక్‌, అనగాని సత్యప్రసాద్‌తో పాటుగా ఆదిరెడ్డి భవాని, వంశీ, మద్దాల గిరితో బాబు భేటీకి హాజ‌రు కాలేదు. దీంతో పార్టీ పెద్ద అంచ‌నా వేసింది ఒక‌టి..జ‌రిగింది మ‌రొక‌ట‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: