మావోయిస్టులతో సంబంధాలకేసులో అరెస్ట్ అయిన ఓయూ ప్రొఫెసర్ కాశింను.. చీఫ్ జస్టిస్ ముందు గజ్వేల్ పోలీసులు హాజరుపర్చారు. మరోసారి హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కాశిం అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కౌంటర్ ద్వారా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

 

ఓయూ ప్రొఫెసర్ కాశీమ్ అరెస్ట్‌ను సవాలు చేస్తూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్ట్ కాశీమ్ ను హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది.. కోర్ట్ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ కాశింను ..చీఫ్ జస్టిస్ ముందు గజ్వేల్ పోలీసులు హాజరు పర్చారు. కాశిం అరెస్టును సవాల్ చేస్తూ లక్ష్మణ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై.. హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న అధ్యాపకుడిని .. అక్రమంగా అరెస్ట్ చేశారని.. పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2016లో నమోదైన కేసులో కాశిం ఏ-2గా ఉన్నారని.. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే ఓయూలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కాశిం.. కేసు అయినప్పటి నుంచి ఎక్కడికీ పోలేదని.. కాలేజీ నుంచి జీతం సైతం తీసుకుంటున్నాడని.. పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కావాలనే అక్రమకేసులు బనాయించి పోలీసులు వేధిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఇరుపక్షాల వాదనలు విన్న కోర్ట్ .. అరెస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను కౌంటర్ ద్వారా ఈ నెల 23 లోపు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24 వాయిదా వేసింది ధర్మాసనం.

 

ఐదేళ్ల క్రితం కేసులో ఇప్పుడెలా అరెస్ట్ చేస్తారని  కోర్టు ప్రశ్నించిందని కాశిం భార్య స్నేహలత తెలిపారు. కాశింను పిలిచి నేరుగా స్టేట్ మెంట్ తీసుకున్నారన్నారు. సిద్దిపేట కోర్ట్ లో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.  అయితే ప్రభుత్వ తరపు లాయర్‌ మాత్రం మావోలతో కాశింకు సంబంధాలపై ఆధారాలు లభించాయని చెబుతోంది. ఈనెల 24కు విచారణ వాయిదా పడడంతో అప్పటికి పూర్తి వివరాలు సమర్పించేందుకు సిద్ధం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: