ఏపీ రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుంది..? క్యాబినెట్‌లో ఏం చర్చించబోతున్నారు..? అసెంబ్లీలో పెట్టే బిల్లులు ఏంటి..? ఇప్పుడు ఈ విషయాలు ఏపీ రాజకీయా వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే సీఎం జగన్‌ మాత్రం అంతా గప్‌చుప్‌గా పని కానిచ్చేస్తున్నారు. జగన్‌ ఏం చేస్తున్నారో అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. కొందరు మంత్రులకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

 

ఏపీకి సోమవారం బిగ్ డే కాబోతోంది.  అసెంబ్లీలో  రాజధానుల అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే రాజధానిపై ప్రభుత్వం మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్షాలకు ఏ ఒక్క విషయం పొక్కకుండా జాగ్రత్త పడుతోంది.  కేవలం సీనియర్‌ మంత్రులు, కీలక నేతలతోనే మంతనాలు జరుపుతున్నారు సీఎం జగన్‌. అసెంబ్లీ సమావేశాల ముందు నిర్వహించే వైసీఎల్పీ, స్ట్రాటజీ సమావేశాలను కూడా పక్కన పెట్టింది ఏపీ సర్కార్‌. 

 

అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉండటంతో  తన దృష్టిని శాసనమండలిపై పెట్టింది ఏపీ ప్రభుత్వం. మండలిలో బిల్లులను ఎలా ఆమోదించుకోవాలన్న అంశంపైనే ప్రధాన దృష్టి సారించింది. మండలిలో ప్రతికూల పరిస్థితి ఎదురైతే ఎలా అధిగమించాలని ఆలోచిస్తోంది. రాజధానులు వికేంద్రీకరణ చేయాలంటే కీలకమైనది సీఆర్డీఏ. అందుకు అనుగుణంగా సీఆర్డీఏని రెగ్యులర్‌ బిల్లుగా ప్రవేశ పెట్టాలా లేదా మనీ బిల్లుగా పంపాలా అనే అంశంపై కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. సీఆర్డిఏ రద్దు బిల్లుకు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు తీసుకెళ్లేందుకు తర్జన భర్జన పడుతోంది.

 

మొదట క్యాబినెట్ సమావేశం... తర్వాత బీఏసీ మీటింగ్ , ఆ తర్వాత అసెంబ్లీ సమావేశం ప్రారంభం అవుతాయి. క్యాబినెట్ భేటీ వరకూ అజెండా ఏంటి అన్న విషయం అత్యంత గోప్యంగా ఉంచాలని సీఎం నిర్ణయించారు. మరోపక్క మూడు రాజధానులు ఏర్పాటుకు అసెంబ్లీలో కేవలం తీర్మానం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

ఏది ఏమైనా ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది.. అసెంబ్లీలో ఏ వ్యూహంతో ముందుకెళ్తుందనేది పొలిటికల్‌ సర్కిల్స్‌లో హై టెన్షన్‌ రేపుతోంది. రాజధాని రైతులకు మంచి ప్యాకేజీ ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అయితే న్యాయ, సాంకేతికపరమైన చిక్కులను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: