సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జనసేన పార్టీ దూకుడుతో ముందుకు సాగుతోంది. ప‌వ‌న్ ఆదేశించ‌డం, పార్టీ నేత‌లు పాటించ‌డం అన్న‌ట్లుగా త‌క్ష‌ణ‌మే ప‌నులు జ‌రిగిపోతున్నాయి. తాజాగా కీల‌క‌మైన హైద‌రాబాద్ విష‌యంలో ఇదే జ‌రిగింది. గ్రేటర్ హైదరాబాద్ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారు. పన్నెండు మందితో కూడిన ఈ కమిటీని కార్యకర్తల అభీష్టంతో ఎంపిక చేశారు. అయితే, ఇది జ‌రిగింది ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మావేశం ఏర్పాటు చేసిన మ‌రుస‌టి రోజే కావ‌డం గ‌మ‌నార్హం. 

 

హైదరాబాద్ ప్రశాసన్‌నగర్‌లోని జ‌న‌సేన‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం . గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. తెలంగాణాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చెప్పారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పడు పార్టీని తెలంగాణాలో బలోపేతం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించుకుందామని, అర్హులయిన పేర్లను కార్యకర్తలే సూచించాలని అవకాశం ఇచ్చారు. కమిటీల ఏర్పాటు కార్యకర్తల అభీష్టం మేరకే జరుగుతుందని స్పష్టం చేశారు.

 

ప‌వ‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేసిన మ‌రుస‌టి రోజే...గ్రేట‌ర్ క‌మిటీ ఏర్పాటైంది. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షునిగా రాధారం రాజలింగం, ఉపాధ్యక్షులుగా దామరోజు వెంకటాచారి, అచ్చుకట్ల భాను ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా చిన్నమదిరెడ్డి దామోదర రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మీర్జా అబిద్, బిట్ల రమేష్, వాకా వెంకటేష్, సిటీ కమిటీ కార్యదర్శులుగా నందగిరి సతీష్ కుమార్, మండలి దయాకర్, కార్యనిర్వాహక సభ్యులుగా యడమ రాజేష్, గనప సైమన్ ప్రభాకర్ (కిరణ్), షేక్ రియాజ్ వలిని నియమించారు.

 

కాగా, ఆదివారం మధ్యాహ్నం ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజా సేవకు అంకితమవుతూ, పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా త్రికరణశుద్ధిగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. కమిటీ సభ్యులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభినందిస్తూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని ఉద్బోధించారు. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నియామకంతో తెలంగాణాలో పార్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఇదే విధంగా గ్రామ కమిటీల వరకు అంచెలంచెలుగా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. తొలుత ఉమ్మడి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు త్వరలోనే పూర్తి చేయాలని పార్టీ ఉపాధ్యక్షులు  బి.మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్ ను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: