మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత మెల్లి మెల్లిగా జూనియర్ ఎన్టీయార్ కు మద్దతు పెరిగిపోతున్నట్లే ఉంది. అసలు ఎన్నికలకు ముందే జూనియర్ ను ఎన్నికల ప్రచారానికి దింపాలని చాలా డిమాండ్లే వినిపించాయి. అయితే పుత్రరత్నం నారా లోకేష్ మీదున్న ప్రేమతో జూనియర్ కోసం వచ్చిన డిమాండ్లను చంద్రబాబునాయుడు తొక్కిపడేశారు.

 

సరే అయ్యిందేదో అయిపోయిందనుకున్న  చంద్రబాబు  కొడుకును ప్రమోట్ చేసే పనిలో పడ్డారు.  తాను ప్రమోట్ చేయటమే కాకుండా ఎల్లోమీడియాతో చేయిస్తున్నా, ఎన్ని జాకీలేసి లేపాలని ప్రయత్నిస్తున్నా పాపం పుత్రరత్నం మాత్రం ఎంతకీ లేవటం లేదు. ఈ నేపధ్యంలోనే  మళ్ళీ జూనియర్ ఎన్టీయార్ ను పార్టీలోకి తేవాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి.

 

మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లాలోని యర్రగొండుపాలెంలో  జూనియర్ ఫొటోతో పెద్ద సైజు కటౌట్ ప్రత్యక్షమయ్యింది. టిడిపి నేతలే జూనియర్ ను భవిష్యత్తు సిఎంగా  అభివర్ణిస్తు వెలసిన వినైల్ పార్టీలో సంచలనంగా మారింది. ఈ విషయమై పార్టీలో చర్చ జరుగుతుండగానే తాజాగా దెందులూరులో  మరో పోస్టర్ ప్రత్యక్షమయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  రెండు పోస్టర్లలో కూడా  చంద్రబాబు, లోకేష్ ఫొటోలు చిన్నవైపోయాయి.

 

అంతకుముందు కృష్ణా జిల్లాలోను ప్రధానంగా విజయవాడలోనే జూనియర్ కు మద్దతుగా పెద్ద పెద్ద వినైల్ పోస్టర్లు వెలిశాయి. ఎక్కడ పోస్టర్లు వెలుసినా పార్టీలో అదో పెద్ద చర్చగా మారిపోతోంది. ఎందుకంటే ఒకవైపు లోకేష్ కెపాసిటి బయటపడిపోవటం మరోవైపు చంద్రబాబు నాయకత్వంపై నేతల్లో నమ్మకం తగ్గిపోవటంతో  జూనియర్ కోసం డిమాండ్లు పెరిగిపోతున్నాయి.

 

జూనియర్ కోసం డిమాండ్లు ఎంత స్ధాయిలో పెరిగిపోయాయంటే పార్టీ నేతలతో  చంద్రబాబు సమావేశాలు పెట్టినపుడే నినాదాలు చేసేస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా  విశాఖపట్నం సమావేశంలో ఉండగానే నేతలు, కార్యకర్తలు జూనియర్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు మొదలవ్వటంతో  చంద్రబాబుకు మండిపోయింది. అయితే బహిరంగంగా మింగలేక కక్కలేక నేతలపై మండిపడ్డారు. మొత్తానికి జూనియర్ కోసం మొదలైన డిమాండ్లు ఎక్కడి దాకా వెళతామో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: