మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. పేరుకు పార్టీల పేరుతో పోరాటం జరిగినా.. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా నేతలు నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో పలు ఆసక్తికరమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. టీడీపీ అంటేనే కస్సుమనే రకం టీఆర్ఎస్. టీడీపీ నుంచి వచ్చిన చాలామంది నేతలు ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అలా క్రమంగా టీడీపీ తెలంగాణలో ఉనికిలోనే లేకుండా పోయింది.

 

కానీ మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల ఆ పార్టీ కూడా బరిలో దిగుతోంది. గెలుపు సంగతి అంటుంచి పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే టీఆర్ఎస్ పార్టీలో నేతలు ఎక్కువమంది కావడం వల్ల.. అక్కడక్కడా సమన్వయ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో రెబల్స్ పుట్టుకొస్తున్నారు. అసంతృప్తులు ప్రత్యర్థులకైనా చేయందిస్తాం కానీ.. సొంత పార్టీ నేతల నిర్ణయాలను శిరసావహించలేం అంటున్నారు.

 

వికారాబాద్ జిల్లాలో అదే జరిగింది. టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా వికారాబాద్‌ మునిసిపాలిటీలో ఓ టీడీపీ అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఒంటెత్తు పోకడ పోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు పని చేసే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ తరఫున బరిలో ఉన్న కౌన్సిలర్‌ అభ్యర్థి చొప్పరి యాదయ్యకు మద్దతిచ్చారు.

 

టీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని, ఆ ఆవేదనతోనే టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రామయ్య గూడ సత్తి తెలిపారు. ఇంకా ఇలాంటి సిత్రాలు ఎన్ని చూడాల్సి వస్తుందో చెప్పలేం. ఇవి పూర్తిగా స్థానిక పరమైన ఎన్నికలు కాబట్టి వ్యక్తిగత చరిష్మా కూడా బాగా పని చేస్తుంది. ఆ సమయంలో పార్టీలకు అతీతంగా నాయకులు నిర్ణయం తీసుకుంటుంటారు. అది కూడా ఇలాంటి చిత్రాలకు కారణమవుతుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: