ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు అమలుపై ఏపీ సీఎం జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గరని సంగతి గత ఎనిమిది నెలల పాలన కాలంలో స్పష్టంగా తెలిసింది. తాను తీసుకునే నిర్ణయాలపై ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసిన జగన్ మాత్రం వాటి అమలుపై ముందుకే వెళ్లారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూగా ఉన్న మూడు రాజధానుల విషయంలో కూడా జగన్ దూకుడుగా వెళుతున్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా మూడు రాజధానుల ఏర్పాటుపై ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

ఇప్పటికే దీనికి సంబంధించి పలు కమిటీలని వేసి నివేదికలని తెప్పించుకున్న జగన్....మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదముద్ర వేయాలని చూస్తున్నారు. అలాగే అమరావతికి సంబంధించి ఏర్పాటు అయిన సి‌ఆర్‌డి‌ఏ చట్టాన్ని కూడా రద్దు చేసే బిల్లుని కూడా అసెంబ్లీలో పాస్ చేయించాలని అనుకుంటున్నారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయాలపై పూర్తి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ ఈ బిల్లులని అడ్డుకోవాలని చూస్తుంది. అందుకు శాసనమండలిని వేదికగా చేసుకోవాలని అనుకుంటుంది.

 

శాసన సభలో ఎలాగో వైసీపీకి బంపర్ మెజారిటీ ఉంది. కాబట్టి అక్కడ ఈ రెండు బిల్లులకు ఆమోద ముద్ర పడటం ఖాయం. అయితే శాసనమండలిలో మాత్రం టీడీపీకి మంచి మెజారిటీ ఉంది. 55 మంది ఎమ్మెల్సీలు ఉండే మండలిలో టీడీపీకి 32 మంది వరకు ఉండగా, వైసీపీకి 9 మంది సభ్యులు ఉన్నారు. మిగతా వారిలో బీజేపీ సహ ఇండిపెండెంట్ అభ్యర్ధులున్నారు. ఇలాంటి తరుణంలో శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లులు గట్టెక్కడం కష్టం.

 

దీంతో టీడీపీకి బలం ఉన్న మండలిలో బిల్లు ఆమోదముద్ర పడేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు టీడీపీ ఎమ్మెల్సీలని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులోనూ ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన వారిని బిల్లుకు మద్ధతు తెలిపేలా ప్లాన్ చేస్తున్నారు. జగన్ వ్యూహంలో భాగంగానే టీడీఎల్పీ సమావేశానికి కొందరు ఎమ్మెల్సీలు గైర్హాజరు అయినట్లు తెలిసింది. మరి చూడాలి జగన్ ఏ మేరకు టీడీపీ ఎమ్మెల్సీలని తమ వైపు తిప్పుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి: