మూడు రాజధానుల అంశం టీడీపీ కొంప ముంచనుందా? తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా టీడీపీకి ఎదురుదెబ్బ తగలనుందా? అంటే అవుననే సమాధానం ఎక్కువ వినిపిస్తోంది. 2009 వరకు ఉమ్మడి ఏపీలో అదిరిపోయే బలంతో ఉన్న టీడీపీ...ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం దెబ్బకు చాలా నష్టపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాతం వల్ల పార్టీకి ఊహించని డ్యామేజ్ జరిగింది. మొదట్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడవకుండా గోడ మీద పిల్లిలా ఉండిపోయారు. ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చిన, అప్పటికి పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

 

చివరికి రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో పార్టీ తుడుచుపెట్టుకుపోయింది. సరే ఏపీలో బలంగా ఉంది అనుకుంటే, 2019 ఎన్నికల్లో చావుదెబ్బ తిని 23 సీట్లకు పరిమితమైంది. ఇక ఎన్నికల అయిన దగ్గర నుంచి టీడీపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వరుసగా నేతలు పార్టీని వీడారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చి, ఆ నిర్ణయాన్ని అమలు చేసే పనిలో బిజీగా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ ముందుకెళుతుంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు, టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చారు.

 

ఇక ఇక్కడే బాబు...తెలంగాణలో చేసిన తప్పునే రిపీట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఏపీలో మెజారిటీ ప్రజలు మూడు రాజధానులకు జై కొడుతున్నారు. కేవలం అమరావతి ప్రాంతం, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాల ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే రాజధానిగా అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతుంది. అలాగే అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. పైగా మూడు రాజధానులు ఏర్పాటు ఖాయమైపోయింది. దీంతో అక్కడి ప్రజలు కూడా వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మారే అవకాశముంది.

 

కానీ అమరావతినే పట్టుకుని వేలాడుతున్న టీడీపీకి ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పటికే రాయలసీమలో పార్టీ పరిస్తితి అంతంత మాత్రం ఉంది. కాస్తో కూస్తో బలంగా ఉన్న ఉత్తరాంధ్రపై పట్టు కోల్పోనుంది. ఇక ఇలాగే కొనసాగితే టీడీపీ కోస్తాకే పరిమితం కావాలి. చూడాలి మరి రానున్న రోజుల్లో టీడీపీకి ఎలాంటి నష్టం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: