భారత్‌ ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. 2020 బడ్జెట్‌.. సమస్యలతో టీ20 మ్యాచ్‌లానే ఉండనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా.. కోలుకునే లోపే ఫలితం తలకిందులయ్యే అవకాశాలే చాలా ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఒక విష వలయంలో చిక్కుకుందనే చెప్పాలి.

 

ప్రస్తుతం జీడీపీ వృద్ధిరేటు 11ఏళ్ల కనిష్ఠ స్థాయిలో 5 శాతానికి రావడం ప్రధాన సమస్యగా మారింది. దేశీయంగా డిమాండ్‌ తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. డిమాండ్‌ తగ్గడంతో ఉత్పాదక రంగం కుంటుపడింది. ఫలితంగా పన్ను వసూళ్లు పడిపోయాయి. దీంతో ద్రవ్యలోటు పెరిగిపోయి ప్రభుత్వ వ్యయం తగ్గింది. వీటన్నిటి ప్రభావంతో ఉద్యోగాలు తగ్గిపోయి నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు పెరగడంతో ప్రజల చేతిలో డబ్బు లేక డిమాండ్‌ పడిపోయింది. 

 

ముఖ్యంగా దేశీయంగా డిమాండ్‌ పెరిగితే చాలా వరకు సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఈ సారి బడ్జెట్‌ కూడా ప్రభుత్వం డిమాండ్‌ను పెంచేలా చర్యలు తీసుకొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ సారి వ్యయాన్ని పెంచేందుకు ద్రవ్యలోటు కట్టడి విషయంలో మరికొంత పట్టువిడుపు ధోరణిలో ఉండే అవకాశం ఉంది. ఈ వ్యయాన్ని కూడా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులపై పెట్టే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగాలు రావడంతోపాటు.. ఈ ప్రాజెక్టుల రూపంలో భవిష్యత్తులో ప్రభుత్వానికి మరిన్ని ఆదాయ వనరులు సమకూరుతాయి. 

 

ప్రత్యక్ష పన్నుల సంస్కరణలను వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు జీఎస్‌టీలో ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత సరళంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. వ్యవస్థలోకి నగదును ప్రవహింపజేసి డిమాండ్‌ను పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కానుంది. ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచకోవడం ద్వారా నగదు వినియోగించుకొనే అవకాశాలను ప్రభుత్వం మెరుగు పర్చుకోవచ్చు. ఇప్పటికే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం.. పన్ను మినహాయింపులు పెంచడం.. వంటి వాటితో ప్రజల వద్ద నగదు నిల్వలను పెంచవచ్చు.

 

2020లో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసి ప్రభుత్వం నిధులను సమకూర్చుకొనే అవకాశాలు ఉన్నాయి.  అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేసి ఉద్యోగాలను పెంచవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: