ఎన్నిక ఏదైనా... ఇప్పుడు చాలా కాస్ట్ లీ అయిపోయాయి. స్ధానిక సంస్ధల ఎన్నికలు మొదలుకుని.. అసెంబ్లీ ఎన్నికల వరకు.. పైసా లేనిదే పని జరగదు. నిన్నా...మొన్నటి వరకు వెంట తిరిగిన వాళ్లు కూడా... ఎన్నికలు అనగానే ఏదైనా ఉందా...? అని అడిగేస్తారు. అటు అధికార పార్టీ అయినా.. ఇటు ప్రతిపక్షం అయినా డబ్బులేనిదే తిప్పలు తప్పవు. ప్రస్తుతం తెలంగాణ లో జరుగున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఈ సమస్య మరింత తీవ్రంగానే మారింది.

 

మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సరే... పరువైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. జనంలోకి వెళ్లటం... ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఎవరిక  స్ధాయిలో వారు చేస్తునే ఉన్నారు. కానీ అది రాజకీయంగా అక్కరకు వచ్చే పరిస్ధితి మాత్రం కనిపించటం లేదు. అధికార పక్షాన్ని అడ్డుకోవటానికి కాంగ్రెస్ కి శక్తి సరిపోవటం లేదు. నాయకులు ఉన్నారు... నాయకత్వం ఉంది. కానీ కేసీఆర్ ని ఢీ కొట్టే వారే కనిపించటం లేదు. దీనికి తోడు మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు అంతా కాస్ట్ లీ అయ్యాయి. ఆర్ధిక పరమైన అంశాల విషయంలో కాంగ్రెస్ చాలా చోట్లా చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. టికెట్లు ఇవ్వటం...బీ ఫారం ఇచ్చి ప్రచారానికి వెళ్లటం వరకే కాంగ్రెస్ నాయకులు చూసుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా ఇదే పరిస్ధితి. కొందరు ఎంపీలు ఏకంగా...ప్రజలు ఈ ఒక్క సారి కాంగ్రెస్ కి ఓటేయండి... అధికార పార్టీ ధన బలం ముందు మేం నిలబడలేమనే ప్రకటనలు కూడా చేస్తున్నారు.

 

కాంగ్రెస్ నాయకుల్లో గెలుస్తామో...లేదో అనే అనుమానం పెరిగింది. దీనికి తోడు... గెలిచే అవకాశాలున్న చోట కూడా నాయకులు...కాస్త ధైర్యం చేస్తే బయటపడతామనుకున్నా... డబ్బు తీయడానికి కొంత ఆలోచిస్తున్నారు. డబ్బులు పెట్టినా..గెలుస్తామో లేదో..?  అనవసరంగా రెంటికి చెడ్డ రేవడి అవుతుందన్న భావనలోకి వెళ్లారు కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కార్పోరేషన్లలో.. బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ తక్కువ సీట్లలో బరిలో ఉంది. కారణం ఏదయినా.. కాంగ్రెస్ మాత్రం ఎన్నికల్లో తంటాలు పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకుల వ్యవహారం కంటే.. ఎన్నికల్ని ఆర్ధిక వనరులే ప్రభావితం చేస్తున్నాయి. దీంతో... వరుస ఎన్నికల్లో ఓటమితో ఉన్న కాంగ్రెస్ కి మున్సిపల్ ఎన్నికలు తంటాలు తెచ్చిపెడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: