మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల పాత్ర కీలకం కానుంది. ఈనెల 25న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగం పై సర్వత్రా ఆసక్తి చర్చ జరుగుతోంది.

 

ఈ నెల 22న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 2727వార్డులు, 385 డివిజన్లలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 79 వార్డులు, మూడు డివిజన్లు ఏకగ్రీవం అయినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిచిన సభ్యులు తమరిలో ఒకరిని చైర్‌పర్సన్‌, మేయర్‌గా, మరొకరిని వైస్‌చైర్‌పర్సన్‌, డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. పురపాలికలకు సాధారణ ఎన్నికలు ముగిసిన అనంతరం నిర్వహించే తొలి సర్వసభ్య సమావేశంలోనే చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌, మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులు సైతం ఈ సమావేశంలో పాల్గొని ఓటేయాల్సి ఉంటుంది. మూజువాణి ఓటింగ్‌ ద్వారా ఎన్నికల్లో పార్టీ విప్‌ మేరకు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏదైనా కారణంతో తొలి సర్వసభ్య సమావేశం జరిగిన రోజు ఎన్నికలు నిర్వహించలేకపోతే మరుసటి రోజు కచ్చితంగా నిర్వహించాలానే నిబంధన ఉంది.

 

చైర్‌పర్సన్‌, మేయర్, వైస్‌చైర్‌పర్సన్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కీలకపాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కలిగి ఉన్న అధికార పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లో సునాయాసంగా అధికార పీఠాన్ని అధిరోహించే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలి కౌన్సిల్‌ సమావేశం తేదీలను ప్రభుత్వం త్వరలో ఖరారు చేయనుంది. పాలక మండళ్ల ఐదేళ్ల పదవీకాలం కూడా ఆ సమావేశం ప్రారంభమైన రోజు నుంచి మొదలవుతుంది. సభ్యులతో తొలుత ప్రమాణ స్వీకారాలు చేయించాక.. కోరం ఉంటేనే చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలను నిర్వహిస్తారు. ఒకవేళ సభ్యుల సంఖ్య సరిపోకుంటే.. ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి తెలియపరుస్తారు. తదుపరి తేదీని ఎస్‌ఈసీ ప్రకటిస్తుంది. ఈ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు ఉంటాయని... పోటీలో ఉన్న వ్యక్తులకు సమాన ఓట్లు వస్తే.. లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. 

 

పార్టీల వారీగా మొత్తం ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్లను పరిశీలిస్తే.. టీఆర్‌ఎస్‌ వద్ద 148, కాంగ్రెస్, ఎంఐఎం దగ్గర చెరో 10, బీజేపీ వద్ద 6, టీడీపీ వద్ద ఒక ఓటు కలిగి ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటె కొన్ని మున్సిపల్, కార్పొరేషన్ లలో పోటాపోటీ ఉండటంతో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు ఎటు వైపు పడతాయో అనే అంశంపై ఇప్పటి నుంచే ఆయా పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: