ఎన్నికల వేళ ఇళ్లకు తాళాలు పడుతున్నాయి. ఓటరు కనిపించక నేతల టెన్షన్ పడిపోయారు.  పోలీసులు అభయమిస్తున్నా.. స్థానికులు బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. తాజాగా భైంసాలో ఉన్న పరిస్థితి... నేతలకు టెన్షన్‌ తెప్పిస్తోంది. 

 

నిర్మల్ జిల్లా  భైంసాలో మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లుగా పోటీ చేసిన వారికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సాధారణంగా తమ సమస్యలు తీర్చాలంటూ అభ్యర్థుల ముందు ఓటర్లు డిమాండ్లు ఉంచడం కామన్.  కాని ఇక్కడ కాస్త భిన్నం...వారం క్రితం ఇరువర్గాల ఘర్షణలతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు , సాధారణ పరిస్థితులు నెలకొల్పినా ,  రాళ్ల దాడులు జరిగిన ప్రాంతాల్లో జనం ఇంకా తేరుకోలేదు..ఏకంగా ఇండ్లకు తాళాలు వేసి మరీ తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. 

 

ముఖ్యంగా కోర్బా గల్లి, పురానా బజార్ ,జల్ఫకర్ ,కుంట ఏరియాతోపాటు సెన్సిటివ్ ప్రాంతాల్లో.. భయంతో ఇళ్లకు తాళాలు వేసుకుని మరీ జనం పొరుగూళ్లకు తరలిపోయారు. గొడవల కారణంగా తమ ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయని మిగిలిన కొద్దిమంది ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రచారానికి వస్తున్న అభ్య్రర్థులు...పోలింగ్ రోజున ఓటు వేయాలని ఫోన్ ద్వారా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.  

 

ఇరువర్గాల గొడవల్లో అరవై, డెబ్బై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గొడవలతో .సంబంధం లేని వాళ్లను సైతం తీసుకెళ్లారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంట్లో ఉంటే తమనెక్కడ తీసుకెళ్తారో అని భయంతో యూత్ రాత్రి రాత్రే వేరే ప్రాంతాలకు పయనమయ్యారు. మొన్నటి వరకు 144 సెక్షన్ అమలులో ఉండగా ప్రచారంకు వెళ్లే వాళ్లు లేకుండా పోయారు. ఎవరు భయపడాల్సిన పనిలేదని, శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయంటున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ సందడి కనిపిస్తుంటే... భైంసా ప్రాంతంలో మాత్రం ఎన్నికల కళే కనిపించడం లేదు. అయితే పోలీసులు మాత్రం...అభ్యర్థులు, ఓటర్లకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా భైంసాలో ఉన్న పరిస్థితి... నేతలకు టెన్షన్‌ తెప్పిస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: