పొరుగు దేశం చైనా భార‌త్‌పై ఊహించ‌ని రీతిలో కుట్ర‌లు చేస్తోంది. ఇన్నాళ్లు మ‌న‌పై నేరుగా అటాక్ చేసిన డ్రాగ‌న్ కంట్రీ ఇప్పుడు ప‌రోక్షంగా రాజ‌కీయం నెరుపుతోంది. స‌రిహ‌ద్దులో ఎత్తులు పార‌క‌పోవ‌డంతో... హిందూ మహాసముద్రంపై పట్టు సాధించే దిశగా చైనా మరో అడుగు ముందుకేసింది. మయన్మార్‌లో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ శనివారం ఆ దేశంతో 33 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల్లో చైనా చేపడుతున్న ప్రతిష్ఠాత్మక ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌' (బీఆర్‌ఐ) ప్రాజెక్టు పనులతోపాటు ఇతర ప్రాజెక్టుల పనులను కూడా వేగవంతం చేయడం, ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరింత ప్రోత్సహించడం మొదలైనవి ఉన్నాయి.

 


ప్రపంచపటం మీద సూదిమొన మోపేంత భూభాగం కూడా కాని డోక్లాంలో చైనా వివాదం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. భూటాన్‌కు చెందిన ఆ చిన్న భూమిచెక్కమీద చైనా రోడ్డు వేసే నెపంతో కాలు మోపింది. భూటాన్‌తో రక్షణ ఒప్పందం కలిగిన భారత్ అడ్డువెళ్లింది. 73 రోజులపాటు తీవ్ర ఉత్కంఠ. రెండు ఆసియా దిగ్గజాల మధ్య యుద్ధం తప్పదా? అనేంతవరకు వెళ్లింది. చివరకు ఉభయపక్షాలు వెనుకకు తగ్గడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్-చైనా భాయ్‌భాయ్ కరచాలనాలతో డోక్లాం సమస్యకు తెరపడింది. ఈ ఎత్తుగ‌డ విఫ‌లం అవ‌డంతో ఇప్పుడు హిందూ మ‌హా సముద్రంపై క‌న్నేసి ఒప్పందం కుదుర్చుకుంది.

 

 చైనా, మయన్మార్‌ మధ్య దౌత్యసంబంధాలను ప్రారంభించి 70 ఏళ్లు నిండిన నేపథ్యంలో జిన్‌పింగ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం మయన్మార్‌కు చేరుకున్నారు. శనివారం ఆయన మయన్మార్‌ నాయకురాలు ఆంగ్‌సాంగ్‌ సూకీతో భేటీ అయ్యారు. మయన్మార్‌-చైనా ఎకనమిక్‌ కారిడార్‌ను ప్రోత్సహించాలనుకుంటున్నామని, రవాణా, ఇంధనం, సాంస్కృతిక రంగాల్లో ఇరువురం సహకరించుకోవాలని తాము కోరుకుంటున్నామని సూకీ.. జిన్‌పింగ్‌తో చెప్పారు. జిన్‌పింగ్‌ స్పందిస్తూ మయన్మార్‌కు చైనా నమ్మకమైన మిత్రదేశమని తెలిపారు. తమ మిత్రదేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని పేర్కొన్నారు. చర్చల అనంతరం ఇరువురు 33 ఒప్పందాలపై సంతకాలు చేశారు. కాగా, ఈ ఒప్పందాల వ‌ల్ల భార‌త్‌కు ర‌క్ష‌ణ సంబంధ‌మైన ముప్పును క‌లిగించాల‌నుకున్న స‌మ‌యంలో..చైనా త‌న ప్ర‌ణాళిక‌లు సుల‌భంగా అమ‌లు చేయ‌గ‌లుగుతుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: