ఢిల్లీ వేదిక‌గా రాజ‌కీయాలు మారుతున్నాయి. బీజేపీ ర‌థ‌సార‌థి,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల‌పై ప్ర‌త్యే ఫోక‌స్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఏపీలో బ‌లోపేతం అయ్యేందుకు జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పొత్తు కుదుర్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మిత్ర‌ప‌క్ష‌మైన తెలుగుదేశంతో జ‌న్మ‌లో దోస్తీ ఉండ‌ద‌ని ఆ పార్టీ నేత‌లు ప్ర‌క‌టించేశారు. అయితే, ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలోని ఇత‌ర దోస్తుల‌పై మోదీ ఫోక‌స్ ప‌డింద‌ని అంటున్నారు. ఇందులో భాగంగా తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలు ప‌రీశీలిస్తున్న ప్ర‌ధాని తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్ఎస్‌, వైసీపీకి అవ‌కాశం క‌ల్పించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

 

ప్ర‌ధాని మోదీ త‌న టీంలో మార్పులు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. పని తీరు సరిగ్గాలేని మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం కల్పించే దిశగా ప్రధాని యోచిస్తున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ప్రధాని శనివారం ఉదయం తన సన్నిహిత సహచరులను కలుసుకొని మంత్రుల పనితీరుపై, మంత్రిత్వ శాఖలపై సమీక్ష జరిపినట్టు తెలిసింది. మంత్రిత్వ శాఖలను ఎనిమిది క్లస్టర్లుగా విభజించి, వాటి పురోగతిపై చర్చించారని సమాచారం. దీంతో మంత్రివర్గంలో చేరికలు, తొలగింపులతోపాటు మంత్రిత్వ శాఖల మార్పులుకూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక అంశాలతో సంబంధం ఉన్న మంత్రుల మార్పు తప్పదని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. 

 

ఇదే స‌మ‌యంలో మంత్రులకు రెండు శాఖలను అప్పగించే పద్ధతికి కూడా ముగింపు పలుకాలని ప్రధాని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా పార్లమెంట్‌కు ఎన్నికైన వారికి అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. మంత్రివర్గం నుంచి శివసేన తప్పుకున్న నేపథ్యంలో ఎన్డీయే పక్షాల నుంచి ఇద్దరు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, హర్‌సిమ్రత్‌కౌర్‌ మాత్రమే మిగిలారు. దీంతో మిత్రపక్షాలకు మరిన్ని మంత్రిపదవులు ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్టు తెలిసింది. జేడీ(యూ) అధినేత, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ తమకు రెండు క్యాబినెట్‌ పదవులు, ఒక సహాయ మంత్రి పదవి కావాలని కోరినట్టు సమాచారం. క్యాబినెట్‌ పదవుల్లో రైల్వే శాఖను ఆయన కోరినట్టు చెప్తున్నారు. అలాగే అన్నాడీఎంకే కూడా మంత్రివర్గంలో చేరుతామని ఆసక్తిని వ్యక్తపరిచినట్టు తెలిసింది. మరోవైపు తమ ప్రభుత్వంలో చేరాలని కోరేందుకు బీజేపీ నేతలు తెలంగాణ, ఏపీ సీఎంలతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: