పోలవరం స్పిల్‌ వేలో 18.48 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకుగానూ, 15.81 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన 2.67 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను జూలై 2020 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. నెలకు సగటున 33,375 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేయడం ద్వారా వాటిని పూర్తి చేయనున్నారు.  స్పిల్‌ ఛానల్‌లో 18.75 లక్షల క్యూబిక్‌ మీటర్లకుగానూ, 13.31 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 5.44 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను నెలకు 48,545.55 క్యూబిక్‌ మీటర్ల చొప్పున పూర్తి చేయడానికి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తోంది. గోదావరికి వరదలు వచ్చేలోగా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, నిర్వాసితుల పునరావాసం పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిపుణుల కమిటీ కొనియాడింది.

ఆర్థిక వనరులు సమకూర్చితే ఆ యాక్షన్‌ ప్లాన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తుందని స్పష్టం చేస్తూ కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హెచ్‌కే హల్దార్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీ  కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు శనివారం నివేదిక ఇచ్చింది.  వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు చేయడానికి వీలుగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను జూన్‌ నాటికి పూర్తి చేయడానికి కసరత్తు సాగిస్తున్నారు.  41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే పనులు చేపట్టారు. వాటిని మే నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. కుడి కాలువ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎడమ కాలువలో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని.. కొత్త కాంట్రాక్టర్లకు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పనులు అప్పగించి.. 2021 నాటికి డిస్ట్రిబ్యూటరీలతో సహా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు.  

వచ్చే సీజన్‌లో ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌.. కాలువలకు నీటిని సరఫరా కుడి, ఎడమ అనుసంధాలు, స్పిల్‌ వేకు గేట్లు బిగించే ప్రక్రియతోసహా 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించే దిశగా కసరత్తు చేస్తున్నారు.  పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికను(యాక్షన్‌ ప్లాన్‌) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసించింది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లు. ఇందులో ఏప్రిల్‌ 1, 2014 నాటికి రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి సెప్టెంబరు 2019 వరకూ రూ.11,377.243 కోట్లు వెచ్చించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,764.16 కోట్లు(ఇందులో పీపీఏ కార్యాలయ నిర్వహణ వ్యయం రూ.15 కోట్లు) రీయింబర్స్‌ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వానికి 2018–19లో రూ.393.51 కోట్లు. నవంబర్‌ 8, 2019న రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఆ నిధులను విడుదల చేయలేదు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు. ఇందులో జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయంపోగా మిగతా.. అంటే రూ.50,987.96 కోట్లు నీటిపారుదల విభాగం వ్యయం. ఆ మేరకు నిధులను సమకూర్చితే సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించవచ్చునని నిపుణుల కమిటీ పేర్కొంది. దీనిపై స్పందించిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రశంచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: