ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో... స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సోమవారం నుంచి సభ సమావేశం అవుతున్న త‌రుణంలో...ఆయ‌న స‌భ్యుల‌కు హెచ్చ‌రిక‌లు చేశారు.చట్ట సభలకు హాజరుకాకుండా నిరోధించడమనేది సభా హక్కులను హరించడమే అవుతుందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం కచ్చితంగా తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. త‌ద్వారా స‌భ‌లో ఆందోళ‌న చేసే వారిపై చ‌ర్య‌లు క‌ఠినంగానే ఉంటాయ‌ని హింట్ ఇచ్చేశారు శాసనసభ స్పీకర్‌ .

 

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్ట సభలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. ఈ చట్ట సభల ద్వారా రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేసేందుకు రాజ్యాంగం విశేష అధికారాలను కట్టబెట్టిందని శాసనసభ స్పీకర్‌ గుర్తుచేశారు. అటువంటి చట్ట సభలకు సభ్యులు రాకుండా అడ్డుకోవడం, అటువంటి చట్ట సభలను ముట్టడించడం చట్టరీత్యా నేరమని అందరూ గుర్తించాలని, ముఖ్యంగా ప్రజలు ఈ అంశాన్ని తెలుసుకోవాల్సి న అవసరం ఉందన్నారు తమ్మినేని సీతారాం . అసెంబ్లీ నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో ఎవరైనా అడ్డుకుంటే, అది సభా హక్కుల ఉల్లంఘన అవుతుందని  అన్నారు. చట్టానికి లోబడి ఎవరైనా నిరసన తెలియజేయవచ్చన్నారు. 

 

సభ్యుల సమస్యలు సభలో ఎవరైనా చెప్పుకోవచ్చని, అంతేకానీ దాడులుచేస్తాం, ముట్టడిస్తాం అనేది సరైన పద్దతి కాదని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తేల్చిచెప్పారు. సభకు సభ్యులు రాకుండా అడ్డుకోవడం కూడా నేరమేనని చెప్పారు. అలాంటి వారిపై చర్యలు తీసుకునే హక్కు సభకు ఉందని స్పీకర్‌ స్పష్టం చేశారు. సభ్యుల హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని రాజ్యాంగం కల్పించిందని గుర్తుచేశారు. రైతులకు ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: