రాజధాని అమరావతి కోసం ప్రత్యక్ష ఉద్యమంలోకి దిగేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. మిత్రపక్షం బీజేపీతో కలిసి ఉమ్మడి పోరాటాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఉద్యమ కార్యాచరణపై పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కీలక సమావేశం సోమవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలో జరగనుంది. అమరావతిపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై భేటీలో చర్చిస్తారు. బీజేపీతో పొత్తు తర్వాత కలిసి పనిచేయడంపై కూడా సమావేశంలో చర్చిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

రాజధాని అంశంపై సోమవారం ఉదయం రాష్ట్ర కేబినెట్‌ తీసుకునే నిర్ణయాలు, అసెంబ్లీలో ప్రభుత్వ విధానాలను బట్టి కార్యాచరణను పార్టీ అధిష్టానం ఖరారుచేస్తుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదని పవన్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాజధాని తరలింపుపై సోమవారం ప్రభుత్వం నుంచి స్పష్టత రానుంది.వికేంద్రీకరణ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.  ఈ బిల్లుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి మద్దతు తెలిపేలా అధికార పక్షం కసరత్తు పూర్తి చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నుంచి నలుగురు ఎమ్మెల్యేల చొప్పున బిల్లుపై సభలో మాట్లాడనున్నారు.

వైకాపా వ్యూహ బృందం ఆ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆదివారం సమావేశమైంది. ఎవరెవరు ఏ అంశాలపై మాట్లాడాలన్నది చర్చించింది. కృష్ణా నుంచి మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు కె.పార్థసారథి, జోగి రమేష్‌, గుంటూరు నుంచి ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడే అవకాశం ఉంది.సోమవారం నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే రాజధాని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఛలో అసెంబ్లీకి జేఏసీ, పలు రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీకి వ్యక్తిగత పనులపై వెళ్లేవారని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసుల సూచించారు. ఈ నేపథ్యంలోనే జనసేన కూడా పీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: