ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మ‌రోమారు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మున్సిపాలిటీలో ఎన్నిక‌ల్లో పోటీచేస్తున్న ఎంఐఎం అభ్యర్థుల గెలుపు కోసం నిర్వహిస్తున్న‌ ప్రచార సభల‌కు హాజర‌వుతున్న  మజ్లిస్‌ పార్టీ అధినేత ఈ క్ర‌మంలో ఆస‌క్తిక‌రంగాస్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వ పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం గురించి, దాని ప‌రిణామాలపై ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్టిన ఓవైసీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలను బీజేపీ రెఫరెండంగా తీసుకోవాలని ఓవైసీ సవాల్‌ విసిరారు.

 

ముస్లింలు దేశానికి పట్టిన చెదలు అన్నట్లు బీజేపీ, ఆరెస్సెస్‌ వ్యవహరిస్తున్నాయని మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. దేశానికి పట్టిన అసలు చెదలు బీజేపీ, ఆరెస్సెస్సేనని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింల పాత్ర కీలకమైనదని మజ్లిస్‌ పార్టీ అధినేత పేర్కొన్నారు. ముస్లింలు దేశభక్తులని అసదుద్దీన్‌ ఒవైసీ విశ్లేషించారు. నిరుద్యోగం గురించి తాను ప్రశ్నిస్తుంటే ఆరెస్సెస్‌ మాత్రం దేశంలో ఇద్దరు పిల్లల విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నదని  హైదరాబాద్‌ ఎంపీ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. దేశవ్యాప్తంగా మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

 

మజ్లిస్‌ పార్టీ ఒక్క హైదరాబాద్‌కే పరిమితమయ్యిందని ప్రచారం చేస్తుండటాన్ని ఓవైసీ తప్పు పట్టారు. 70 ఏళ్ల‌లో మజ్లిస్‌ పార్టీ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిందని ఓవైసీ చెప్పుకొచ్చారు. ఎంఐఎం నుంచి ఎన్నికల్లో పోటీలో ఉంటే కాంగ్రెస్‌, బీజేపీలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏ ఒక్కచోట బీజేపీకి మున్సిపల్‌ పీఠం దక్కబోదని మజ్లిస్‌ పార్టీ అధినేత జోస్యం చెప్పారు. టీఆర్ఎస్‌, బీజేపీ అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌నున్నార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కాగా, ఇప్ప‌టికే ప‌లు వార్డుల్లో ఎంఐఎం అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌ల‌య్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: