మున్సిప‌ల్ ఎల‌క్ష‌న్ల హ‌డావిడి మొద‌లైంది. ఈ రోజుతో ప్ర‌చారం కూడా ఆపివేయ‌డం జ‌రుగుతుంది. ఇదివ‌ర‌కు ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్నాయంటే చాలు అప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోని లీడ‌ర్లు, పార్టీలు కూడా ఎల‌క్ష‌న్స్ ముందు మాత్రం అక్క‌డ ప్ర‌జ‌లు లోక‌ల్‌గా ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల పై స్పందిస్తుంటారు. అవి ఎలాంటివంటే...ఇంటర్నల్​ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్​ లైట్స్​, పార్కులు, స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్​ బిల్డింగుల గురించి మాట్లాడేవారు. కొత్త ఇండస్ట్రీస్​ తెస్తామనీ, యూత్​కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీలిచ్చేవారు. 

 

మేం అధికారంలో ఉన్న‌ప్పుడు ఇవి చేసేవాళ్ళం... అవి చేసేవాళ్ళం అంటూ ప్ర‌చారం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ప్ర‌చారం చేసే తీరు మారింది. లోక‌ల్ స‌మ‌స్య‌ల పై నాయకులు పెద్ద‌గా స్పందించ‌డం లేక‌పోగా... కొంత మంది నాయ‌కులు తిరిగి వాళ్ళ‌కు వార్నింగ్‌లు ఇచ్చే వైనం క‌న‌ప‌డుతుంది. కారు గుర్తుకు ఓటెయ్యాలంటూ.. లేదంటే... పించ‌న్లు అంద‌వంటూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పేట‌లో ఎమ్మెల్యే జాజుల సురేంద‌ర్ ఓ వృద్దురాలికి చెబుతున్న మాట‌లివి. దీనికి సంబంధించిన వీడియో క్లిపింగ్​ కూడా ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.  ఎమ్మెల్యే సరదాగా అంటున్నట్లు అనిపించినా ఆ వృద్ధురాలు మాత్రం సీరియస్​గానే తీసుకున్నట్లు కనిపించింది. దీంతో ఇలా టీఆర్​ఎస్​ క్యాండిడేట్లు ఎలక్షన్స్​ కోడ్​కు విరుద్ధంగా నవ్వుతూనే ఓటర్లను వార్నింగ్ ఇస్తున్నారా వాళ్ళ‌ను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఇక్క‌డ‌ వ్యక్తమవుతున్నాయి.

 

అధికారపార్టీ క్యాండిడేట్లు ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌, కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కిట్ల గురించి చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. ఇది ఎక్క‌డా జ‌రిగే ప‌నే అందులో కొత్తేమీ లేదు కానీ... ఆ పథకాలు కొనసాగాలంటే అటు రాష్ట్రంలో, ఇటు మున్సిపాలిటీలో తామే అధికారంలో ఉండాలనీ, లేదంటే ఆ స్కీంలు ఆగిపోతాయనే రీతిలో మాట్లాడుతున్న వైనం ప్ర‌జ‌ల‌కు కాస్త కొత్త‌గా ఉంది. ఈ తరహా ప్రచారానికి విపక్ష నేతలు సరైన కౌంటర్​ ఇవ్వలేకపోతున్నారనే విమర్శలు కూడా మ‌రో ప‌క్క వెల్లువెత్తుతున్నాయి. 


టిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాబోయే ముందు ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో ఇచ్చిన హామీలు... ఇంటింటికీ నీళ్లు, డబుల్​ బెడ్​ రూం ఇళ్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క హైదరాబాద్​, రామగుండం నగరాల్లో తప్ప ఇతర ఏ కార్పొరేషన్​లోనూ, ఏ మున్సిపాలిటీలోనూ అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ సిస్టమ్ మాత్రం స‌రిగా​ లేదనే చెప్పాలి. వర్షాకాలంలో వీధుల్లో ప్ర‌వ‌హించే  వరద నీరు ఇంటర్నల్​ రోడ్లన్నీ దెబ్బతింటున్నాయి. దాని పైన కూడా స‌రైన ప‌ని తీరు క‌నిపించ‌డం లేదు. ఓపెన్​ డ్రైనేజీల కారణంగా దోమలు, ఈగలు, పందులు విజృంభించి పట్టణ, నగర జనాలకు లేని రోగాలు వస్తున్నాయి. కూరగాయల విక్రయాలకు సరైన మార్కెట్లు లేవు. శివారు కాలనీల్లో కనీస మౌలిక వసతులులేవు.  కానీ తాజా ఎన్నికల్లో ఈ విషయాన్ని ఏ లీడరూ ప్రస్తావించడం లేదు.  ఇలా ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో తరహా సమస్యలు ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని  మాత్రం ఏ లీడరూ చెప్పడం లేదు. అధికార పార్టీ క్యాండిడేట్లు ‘నీకు పింఛన్​ ఇస్తున్నాం కాబట్టి ఓటేయండి. అన్న‌ట్లు ఓట్లు అడుగుతున్నారు. 


ఇంకొంత‌మంది నాయ‌కులైతే మ‌రికాస్త ముందుకెళ్ళి క‌నీస అవగాహ‌న లేనివాళ్ళ‌తో... మీరు ఓటు ఎవ‌రికి వేసినా మాకు తెల‌స్త‌దంటూ చెప్ప‌డం. అలాగే లోప‌ల ఎవ‌రికి వేశామో మాకు తెలియ‌దంటూ ఎవ‌రికిప‌డితే వాళ్ళ‌కు వేసి త‌ర్వాత తెలియ‌దంటే మీ జీవితాలే నాశ‌న‌మ‌వుతాయి అంటూ తొర్రూరులో మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడ‌సాగారు. ఈ విధంగా ఓట‌ర్ల‌ను బెదిరిస్తున్న వైనం క‌నిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: