దేశ‌వ్యాప్తంగా, దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌తాల మ‌ధ్య బ‌హిర్గ‌తం కాని చీలిక క‌నిపిస్తున్న త‌రుణంలో....రెండు ప‌క్క ప‌క్క రాష్ట్రాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మ‌న పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌, ఆ రాష్ట్రం ప‌క్క‌న ఉన్న కేర‌ళ‌లో ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌ధానంగా బెంగ‌ళూరులో కీల‌క ప‌రిణామం జ‌రిగింది. అనేక మతాలకు పుట్టినిల్లుగా విలసిల్లుతున్న బెంగళూరు నగరంలో వేయికిపైగా మందిరాలు, 400 మసీదులు, 100 చర్చీలు, 40 జైన మందిరాలు, మూడు సిక్కు గురుద్వారాలు ఉన్నాయి. వీటిలో అతిపురాతనమైన 170 ఏళ్ల‌ మోదీ మసీదును సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తించారు. బెంగళూరు నడిబొడ్డున శివాజీనగర్‌లోని చిన్నస్వామి ముదళియార్‌ రోడ్డులో ఉన్న ఈ మసీదును ఆదివారం నుంచి ముస్లింలు కానివారు దర్శించేందుకు అనుమతించారు.

 

‘విజిట్‌ మై మాస్క్‌డే’ పేరుతో రహమత్‌ గ్రూప్‌ చేపట్టిన ఈ మసీదు సందర్శనానికి హిందువులు, సిక్కులు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మసీదు సందర్శనకు వచ్చేవారు సీఏఏ, ఎన్నార్సీ గురించి నినాదాలు చేయొద్దు, రాజకీయాలు మాట్లాడకూడదన్న షరతువిధించారు. మధ్యాహ్నం వరకు 170 మందిని మాత్రమే అనుమతించాలని ముందుగా అనుకొన్నప్పటికీ.. ఆ సంఖ్య 400 దాటడంతో వారంతా మసీదును సందర్శించేలా చర్యలు తీసుకొన్నారు. మసీదు సందర్శకులకు భోజనాలు కూడా ఏర్పాటుచేశారు. ఇలాంటి కార్యక్రమంతో వివిధ మతాల విశ్వాసాలను ప్రచారం చేయడం అలాగే ముస్లింల ఆచారవ్యవహారాలు, మసీదుల పనితీరును ఇతర మతస్థులు తెలుసుకొనేందుకు వీలు చిక్కుతుందని మోదీ మసీదు నిర్వాహకులు పేర్కొంటున్నారు. ‘ఇది ఒక అద్భుత ప్రారంభం. మున్ముందు ఇలాగే కొనసాగితే ఒకరి మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలను మరో మతంవారు తెలుసుకొనేందుకు వీలుంటుంది’ అని బెంగళూరుకు చెందిన రచయిత అమన్‌దీప్‌సింగ్‌ సంధూ అభిప్రాయపడ్డారు.

 


మ‌రోవైపు కేర‌ళ‌లో ఓ జంట తమ వివాహాన్ని మసీదులో హిందూ సంప్రదాయాల ప్రకారం చేసుకొని పెళ్లికి ఏ గుడి అయినా ఒక్కటే అన్న సందేశం ప్రజల్లోకి పంపి ఆదర్శంగా నిలిచారు. కేరళలోని అలప్పుజ ప్రాంతానికి చెందిన అంజూ, శరత్‌ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ వివాహాన్ని సాధారణంగా కాకుండా ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ఉండాలనుకొని మసీదును ఎంచుకొన్నారు. తమ ఇంటికి సమీపంలోని చెరువల్లి ముస్లిం జమాత్‌ మసీదు నిర్వాహకులను కలుసుకొని తమ మనుసులోని మాట చెప్పారు. దానికి మసీదు పెద్దలు ఒప్పుకోవడంతో ఆదివారం వారి పెండ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మసీదుకు చెందిన ఖాజీలు, ఇమామ్‌ల సమక్షంలో అంజూ మెడలో శరత్‌ తాలి కట్టాడు. అనంతరం వారిద్దరూ పెద్దల ఆశీర్వాదాలు అందుకొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: