అమరావతి.. ఆంధ్రుల రాజధానిగా వెలుగొందాల్సిన నగరం.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన కలల రాజధానిగా ప్రకటించుకున్న నగరం.. ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధానిగా మారుస్తానంటూ పదే పదే చెప్పిన నగరం. ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇందుకు ప్రధాన కారణం.. దీన్ని ఒక నగరంగా కాకుండా ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు తరహాలో చంద్రబాబు సర్కారు నిర్మించే ప్రయత్నం చేయడమనే చెప్పుకోవాలి.

 

రాజధాని నగరం అంటే రాష్ట్ర ప్రజలందరికీ సెంటిమెంటే.. తమ రాజధాని అని అంతా ఫీలవుతారు. కానీ ఇలాంటి రాజధాని నగరాన్ని చంద్రబాబు కొందరి రాజధానిగా మార్చాలనుకున్నారు. రాష్ట్ర విశాల హితం కోసం నిర్మించాల్సిన రాజధాని నగరంలో తన, తనవాళ్ల ప్రయోజనాలను ఆయన వెదుక్కున్నారు. రాజధాని నిర్మాణం అనేది క్రమంగా కాలగతిలో జరగాల్సిన పరిణామాన్ని దాచి పెట్టి.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు.

 

చివరకు దాన్ని ఓ రియల్ ఎస్టేట్ స్థాయికి దిగజార్చడం వల్లే అమరావతి కొందరి కలల నగరం అయ్యిందే తప్ప.. ప్రజల రాజధాని కాలేకపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ.. ప్రాక్టికాలిటీని కానీ అంచనా వేయకుండా.. రాష్ట్రంలో అమరావతి తప్ప ఇంకే అంశం లేనంతగా గత ఐదేళ్లలో చంద్రబాబు ఊదరకొట్టారు. అందులోనూ రాజధాని ప్రాంతంలోని భూములను తన అనుయాయులకు, తన సామాజిక వర్గ నేతలకు, తన ఆప్తులకు పప్పు బెల్లాల్లా పంచి పెట్టే ప్రయత్నం చేశారని విమర్శలు వచ్చాయి.

 

రాష్ట్ర ప్రజలకు తరతరాల పాటు గుర్తుండాల్సిన రాజధానిని కూడా చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల అంశంగా చూడటం వల్లే అమరావతికి నేడు ఈ దుస్థితి కలిగిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజల అవసరాలకు అనుకూలంగా కాకుండా.. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లా అమరావతిని చూడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: