ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చే రోజు ఇది. అమరావతి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే హాట్ టాపిక్.. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా.. లేక.. మూడు రాజధానులకు జగన్ సర్కారు పచ్చజెండా ఊపుతుందా అన్నది కొన్ని గంటల్లో తేలుతుంది. అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా పోరాడుతున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాల పర్యటనలు కూడా చేశారు. ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చారు.

 

ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాజధాని మార్పు కోసం రూపొందించిన బిల్లు, దాని చట్టబద్దత, న్యాయపరమైన ఇబ్బందులపై చర్చించవచ్చు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నబిల్లులు, అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై హై పవర్‌ కమిటీ సిఫార్సుపైనా చర్చిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్‌ కమిటీ, ఇటీవల జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ నివేదికలపైనా చర్చ ఉంటుంది.

 

పలు కమిటీల నివేదికలపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్‌ కమిటీ తమ పరిశీలనలో వెల్లడైన అంశాలను వివరించింది. ఈ మేరకు 130 పేజీల సమగ్ర నివేదిక ఇచ్చింది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక స‌మావేశాలలో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన బిల్లులపై చర్చ జరగే అవకాశం ఉంది.

 

రాష్ట్రాన్ని నాలుగు జోన్లగా విభజించడం గురించి.. అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఏర్పాటు గురించి.. చర్చిస్తారు. అలాగే రాజధాని రైతులను ఎలా ఆదుకోవాలి. సీఆర్డీఎ సవరణ బిల్లు గురించి.. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ ఎలా జరిపించాలి.. లోకాయుక్తకు ఇవ్వాలా వద్దా వంటి అంశాలపైనా చర్చిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: