ఏపీ అసెంబ్లీలో నేడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే నేపథ్యంలో అమరావతిలో అల్లకల్లోలం సృష్టించేందుకు కుట్ర పన్నినట్టు సమాచారం వస్తోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతిలో అలజడి సృష్టించేందుకు అసాంఘిక శక్తులు కుట్రలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

అమరావతి పరిరక్షణ జేఏసీ ముసుగులో అమరావతిలో అలజడి సృష్టించేందుకు కుట్రలకు పాల్పడినట్టు ఇంటెలిజెన్స్‌ అధికారులకు పక్కా సమాచారం అందినట్టు తెలుస్తోంది.ప్రజా ప్రతినిధులపై రాళ్లు వేయడం, కుదిరితే వారిపై దాడి చేయడం వంటి చర్యలకు ప్లాన్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ముందస్తు పథకం ప్రకారం.. రాజధాని గ్రామాల్లోకి ఇతర ప్రాంతాలవారిని రప్పించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేటప్పుడు వారిపై దాడి చేసేందుకు కుట్ర చేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో టీడీపీ సహా పలు పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేసేశారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు గృహనిర్బంధం చేశారు.

 

ఆదివారం రాత్రి నుంచే ఈ హౌజ్ అరెస్టులు మొదలయ్యాయి. పలు నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలను గృహనిర్బంధం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు.. శ్రీకాకుళం జిల్లాలో కూన రవికుమార్‌తో మాజీ ఎమ్మెల్యేలు రమణమూర్తి, వెంకటరమణమూర్తిలను హౌజ్ అరెస్టు చేశారు. సీపీఐ నేత రామకృష్ణను కూడా అరెస్టు చేశారు.

 

అసెంబ్లీ ముట్టడి వంటి ఆందోళనల సమయంలో ఇలా ముందస్తు అరెస్టులు చేయడం కొత్తేమీ కాదు. ఎలాంటి ఆందోళలు జరగకుండా.. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకే ఈ అరెస్టులు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ అసెంబ్లీ సమావేశాలు కీలకంగా జరగనున్నాయి. అయితే.. నేతల గృహనిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: