మోదీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు  వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఎంతోమంది రాజకీయ సినీ ప్రముఖులు సైతం బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రల్లో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. భారీ మొత్తంలో ఆందోళనకారులు రోడ్లపైకి చేరుకుని నిరసన తెలుపుతూ ఉండటంతో... పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో పౌరసత్వ సవరణ చట్టం పై నిరసన జ్వాలలు ఎగసి  పడుతుండడంతో... సవరణ చట్టం పై పునరాలోచించిన  కేంద్ర ప్రభుత్వం... ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. 

 


 ఈ క్రమంలోనే బీజేపీ నేతలు అందరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం పై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో  లో బీజేపీ ముఖ్య నేతలు అందరూ పాల్గొని ప్రజలకు పౌరసత్వ సవరణ చట్టం పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా మధ్యప్రదేశ్లోని రాజ్ ఘడ్  జిల్లా ప్రధాన రహదారిపై బిజెపి చేపట్టిన ర్యాలీ  హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపుచేసేందుకు అక్కడికి వెళ్ళిన డిప్యూటీ కలెక్టర్ ప్రియావర్మ కు చేదు అనుభవం ఎదురైంది. సవరణ చట్టానికి అనుకూలంగా మధ్యప్రదేశ్లోని రాజ్ ఘడ్  లో బిజెపి నేతలు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. 

 

 ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న డిప్యూటీ కలెక్టర్ ప్రియా వర్మ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగిన  బీజేపీ నేతల్లో ఒకరు  డిప్యూటీ కలెక్టర్ ప్రియా వర్మ జుట్టు పట్టుకుని లాగి దాడి చేశాడు. ఆ వెంటనే పోలీసులు ఆమెను రక్షించారు. అయితే కాసేపటికి జుట్టు పట్టుకుని లాగిన వ్యక్తిని ప్రియా వర్మ గుర్తించారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తావా  అంటూ అతని చెంప చెల్లుమనిపించింది   డిప్యూటీ కలెక్టర్. పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. దీనిని తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ సర్కార్  నివేదిక ఇవ్వాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: