నాలుగు రోజుల క్రితం బీజేపీ జనసేన పార్టీల పొత్తు అధికారికoగా ఖరారైంది. ఇరు పార్టీల నేతలు విజయవాడలో భేటీ నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక, సార్వత్రిక ఎన్నికలలోను బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. 2024 సంవత్సరంలో ఏపీలో అధికారమే లక్ష్యంగా రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 
 
బీజేపీ జనసేన పార్టీల పొత్తుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తే వైసీపీ పార్టీ నేతలు మాత్రం విమర్శలు వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ - జనసేన పార్టీల పొత్తు తరువాత ఒక భారీ బహిరంగ సభ అతి త్వరలో జరగనుందని జనసేన గ్రూపుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 
 
ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరైతే బీజేపీ జనసేన పార్టీలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. జనసేన పార్టీకి బీజేపీ పొత్తుల్లో భాగంగా కొన్ని పదవులు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు రాజ్యసభ సీటు, జనసేన పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు కేంద్ర సహాయ మంత్రి పదవి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో కీలక పదవి ఇవ్వబోతున్నట్టు సమాచారం. 
 
2019 ఎన్నికల్లో నరసాపురం నుండి ఎంపీగా పోటీ చేసిన నాగబాబు వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల తరువాత రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూనే టీవీ షోలతో నాగబాబు బిజీ అయిపోయారు. జనసేన పార్టీ తరపున విశాఖ నుండి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికల తరువాత కూడా జనసేన పార్టీనే నమ్ముకొని పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా నాగబాబుకు, జేడీ లక్ష్మీ నారాయణకు పదవులు దక్కుతాయని వస్తున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: