ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈమేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో వైసీపీ - టీడీపీ నాయకుల మధ్య వాడి వేడి చర్చ నడుస్తోంది. తనమీద కోపంతోనే రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారని చంద్రబాబు పదే పదే చేసిన ఆరోపణలను వైసీపీ నాయకులు తిప్పికొట్టారు. టీడీపీ నాయకులు కేవలం 29 గ్రామాల ప్రజల గురించే ఆలోచిస్తున్నారని తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాల ప్రజల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారని అన్నారు.

 

 

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఇక్కడి ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉంది కాబట్టే అమరావతి జపం చేస్తున్నారన్నారు. అందుకు సీఆర్డీఏ ను ఏర్పాటు చేసి బినామీలతో భూములు కొనుగోలు చేయించారని.. అందుకే ఆయన పాకులాడుతున్నారని ఆరోపించారు. CRDA అంటే 'చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీ' అని సెటైర్ వేశారు. చంద్రబాబు తాపత్రయం చూస్తుంటే సీఆర్డీఏ అంటే ఇదే స్ఫురిస్తోందని కన్నబాబు చమత్కరించారు. తమ వారికి భూములు కట్టబెట్టడంలో బాబుకు ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై పెట్టలేదని విమర్శించారు. సినిమా దర్శకులను పిలిపించి స్కెచ్చులు గీయించి గ్రాఫిక్స్ చేయడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

 

 

ఉత్తరాంధ్ర అభివృద్ధి, అక్కడ రాజధాని ఇష్టం లేకపోతే గత ఐదేళ్లలో అనేక అంతర్జాతీయ బిజినెస్ సమ్మిట్ లు విశాఖలోనే ఎందుకు నిర్వహించారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖను చూపించే పెట్టుబడులు తీసుకురావాలనేది అప్పట్లో చంద్రబాబు ఐడియాగా పెట్టుకున్నారు. తమ నాయకుడు సీఎం జగన్ మాత్రం విశాఖను ఓ రాజధానిగా ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధితోపాటు రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల వాదనలకు మంత్రులు ధీటుగా స్పందించారు. మూడు రాజధానులపై సవివరంగా ప్రతి అంశాన్ని వైసీపీ నాయకులు వివరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: