2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమై ఉంటే ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందుతారని 13 జిల్లాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాపాక అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో మన ఆదాయం అంతా పెట్టుబడి పెట్టి హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని చెప్పారు. 
 
ఒక్కసారిగా ఈ రాష్ట్రం విడిపోయిన తరువాత పరిస్థితులు మారిపోయాయని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం నుండి వలస వెళ్లిన కూలీలు తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి పని చేస్తున్నారని అన్నారు. జీతం తక్కువిచ్చినా పెద్దగా బాధ పడరని కడుపునిండా తిండి కావాలని కోరుకుంటున్నారని రాపాక అన్నారు. అటువంటి ప్రాంత ప్రజలకు వైజాగ్ రాజధానిగా వస్తే వాళ్లు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని రాపాక అన్నారు. 
 
ప్రతిపక్షం కూడా ఆలోచించాలని వ్యతిరేకించటం కరెక్ట్ కాదని రాపాక అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను ఇచ్చినట్టుగా అమలు చేస్తున్నారని ఏ పథకం కూడా రాష్ట్రంలో అమలు చేయని పరిస్థితి లేదని అన్నారు. 6,50,000 ఉద్యోగాలను జగన్ సృష్టించారని రాపాక వరప్రసాద్ అన్నారు. అంతమంది నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం సాధారణమైన విషయం కాదని రాపాక వరప్రసాద్ చెప్పారు. 
 
జగన్ కు అనుభవం లేదని అంటూ ఉంటారని అనుభవం అవసరం లేదని ప్రజలకు సేవ చేయాలనే దృక్పధం ఉంటే చాలని రాపాక అన్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా అందరూ మాట్లాడుతున్నారని రాపాక అన్నారు. ప్రజల అభిప్రాయమే మా అభిప్రాయమని రాష్ట్రమంతటా అభివృద్ధి చేయాలని అన్నారు. నిజంగా ఆలోచన చేస్తే చంద్రబాబుకు కూడా మూడు రాజధానులు ఇష్టమేనని రాపాక వరప్రసాద్ అన్నారు. జనసేన పార్టీ తరపున మూడు రాజధానుల బిల్లుకు పూర్తి మద్ధతు తెలియజేస్తున్నానని రాపాక వరప్రసాద్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: