ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ జగన్ సర్కారు బిల్లు ప్రవేశ పెట్టింది. అదే సమయంలో ఈ నిర్ణయం వెనుక ఉన్న చారిత్రక కారణాలను మంత్రి బుగ్గన అసెంబ్లీలో వివరించారు. ఆయన ఏమన్నారంటే.. " వికేంద్రీకరణ ప్రాచీన కాలం నుంచీ ఉన్నదే…ప్రాచీన కాలం నుంచే పరిపాలనా వికేంద్రీకరణ విధానం కొనసాగుతూ వస్తోంది. ఎక్కడ వసూలైన పన్నులు ఆ ప్రాంతాల అభివృద్ధికే ఖర్చు చేయాలి. కొన్ని దశాబ్ధాలపాటు మనం బ్రిటీష్ పాలనలో ఉన్నాం. ఆ రోజుల్లో ఇక్కడ వసూలైన పన్నులను వారి ఆడంబరాలకు ఖర్చు చేసుకున్నారు. లండన్ కు తరలించుకుపోయారు.

 

" ప్రజలు కోరుకునేది అందించగలిగినప్పుడే అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. స్వాతంత్ర్యం రాక ముందు నుంచే రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో సమానత్వం కోసం నిరంతరం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 1910లో తొలిసారిగా మనమే మన ప్రాంతాన్ని పాలించుకోవాలన్న ఉద్యమం మొదలైంది. 1912లో ఆంధ్రమహాసభలు ఏర్పాటయ్యాయి. తెలుగు భాష ప్రాతిపదికన తెలుగు వాళ్లందరం ఒక్కటయ్యాం. తొలి భాషా ప్రయోక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైంది. 1934లో రాయలసీమ మహాసభ ఏర్పాటైంది. అన్ని ప్రాంతాలను కలుపుకుపోవాలనే పెద్దమనుషుల సూచనతో 16 నవంబర్, 1937న ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన చారిత్రాత్మక శ్రీభాగ్ ఒడంబడిక జరిగింది.

 

రాయలసీమ ప్రాంత కరువును ప్రముఖంగా ప్రస్తావించారు. సాగునీటి ప్రాజెక్టులు ఆ ప్రాంతానికి మేలు జరిగేలా ఉండాలని తీర్మానం చేయడం జరిగింది. అధికార వికేంద్రీకరణ జరగాలని ఆనాడే పెద్దమనుషులు తీర్మానం చేశారు. ప్రాంతీయ విద్వేషాలు తలెత్తకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఏ ప్రాంతానికి ఎలా న్యాయం చేయాలనేది జెంటిల్మెన్ ఒప్పందంలో స్పష్టంగా రాసుకున్నారు. కానీ అన్ని ప్రాంతాలను గడిచిన వందేళ్లుగా కలిపి ఉంచుతున్న గొప్ప బంధం తెలుగు భాష ఒక్కటే.. అంటూ చారిత్రాత్మక కారణాలను సభకు వివరించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: