అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అధికార పార్టీకి చెందిన అనేక మంది ప్రసంగించారు. వీరిలో చాలా మంది చంద్రబాబు అనుకూల మీడియా వైఖరిపై ధ్వజమెత్తారు. ఉదాహరణలతో సహా వివరించారు. జగన్ సర్కారుపై బురద జల్లేందుకు వారు చేసిన ప్రయత్నాలను ఎండగట్టారు. మంత్రులు కన్నబాబు, బుగ్గన, కొడాలి నాని వంటి మంత్రులు చంద్రబాబు అనుకూల మీడియాగా పేరున్న ఆ రెండు పత్రికలను ప్రస్తావిస్తూ ఆ రాతలను ప్రస్తావించారు.

 

మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. డబ్బా మీడియా, చెత్త పేపర్లతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీకి మధ్యలో ఉంటేనే అమరావతి అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు చెప్తున్నారు. భారత దేశానికి ఢిల్లీ మధ్యలో ఉందా..? రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆలోచించడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలే కోసమే పరితపిస్తున్నారు. చంద్రబాబుకు స్పష్టత కరువైంది. ఇది అసలు అమరావతి కాదు. ఇది చంద్రబాబు అమరావతి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను తీసుకోవాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగానే చెప్పారు. చంద్రబాబు పిట్టల దొరలా ప్రచారం చేస్తున్నారు'అని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.

 

మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రాజధాని తరలిపోతే కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతుందని.. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని నాని మండిపడ్డారు. కేవలం కమ్మవారి కోసమే ఇక్కడ రాజధాని పెట్టారా..? అని ప్రశ్నించారు. తమిళనాడులో ఉన్నప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ది చెందే ఉన్నాయని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతి వల్ల ఈ రెండు జిల్లాలకు వచ్చేదేమీ లేదని పేర్కొన్నారు.

 

మరోవైపు.. మంత్రి కన్నబాబు కూడా అగ్రశ్రేణి తెలుగు దిన పత్రిక రాతలను ఎండగట్టారు. అమరావతి రాజధానిగా ఉంటే.. బౌద్దం పరిఢవిల్లుతుందని.. దీని ద్వారా విదేశాలతో మన సంబంధాలు బావుంటాయని.. ఇది దేశానికి కూడా మంచిదని.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ పత్రిక రాతలు మరీ దారుణమని వివరించారు. మొత్తానికి మంత్రులు ఎల్లో మీడియాను ఎండగట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: