బిజెపితో కలిసి నడుద్దామంటే మనల్ని కుక్కల్లా చూస్తున్నారు..

మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలనుంది..

 

ఇవి ఒకపుడు పవన్ కల్యాణ్ నోటి నుండి వచ్చిన ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే.

 

బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేసేస్తున్నారు. ట్రోలింగ్ అని పాష్ గా చెప్పటం కన్నా దుమ్ము దులిపేస్తున్నారని అచ్చ తెలుగులో చెబితేనే అందరికీ అర్ధమవుతుంది. రోజుకో మాట మార్చేస్తు, ఇష్టమొచ్చినపుడు పార్టీలను మార్చేసే పవన్ కు రాజకీయాల్లో స్ధిరత్వం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. బిజెపితో పొత్తులు పెట్టుకునే ముందు వివిధ పార్టీల గురించి అప్పట్లో నోటికొచ్చినట్లు మాట్లాడిన వాటన్నింటినీ బయటకు తీసి దుమ్ము దులిపేస్తున్నారు సోషల్ మీడియాలో.

 

2014 ఎన్నికల్లో  చంద్రబాబునాయుడు, బిజెపితో కలిసినా  తర్వాత కమలం పార్టీకి దూరమైపోయారు. నరేంద్రమోడిని నోటికొచ్చినట్లు మాట్లాడారు. వెంకయ్యనాయుడును కూడా వదల్లేదు. తర్వాత చంద్రబాబుకు దూరమయ్యారు. గుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అబ్బా కొడుకులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. తర్వాత తెరవెనుక  ఏమైందో తెలీదు కానీ మళ్ళీ చంద్రబాబుతో చేతులు కలిపారు.

 

మళ్ళీ వామపక్షాలను భాయి భాయి అన్నారు. చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. ఎన్నికల్లో వామపక్షాలతోనే కాకుండా మాయవతి పార్టీ బిఎస్పీతో  కూడా పొత్తు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు వెళ్ళి మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలని ఉందంటూ ప్రకటించారు.  సరే ఎవరితో ఎన్నికలకు వెళ్ళినా  జనాలైతే  తల బొప్పి కట్టించారు. పవన్ స్వయంగా పోటి చేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడగొట్టారు. దాంతో నాలుగు రోజులు మైండ్ బ్లాంకయి ఎక్కడా కనబడలేదు.

 

ఎన్నికలైపోగానే మళ్ళీ చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడటం మొదలుపెట్టారు. పవన్ ఎప్పటికైనా చంద్రబాబు జేబులోని మనిషే అన్నది కన్ఫర్మ్ చేసుకున్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కలిసి పోటి చేయటమే మిగిలుంది అనే సమయానికి హఠాత్తుగా బిజెపితో చేతులు కలిపారు. కమలం పార్టీతో పొత్తు పెట్టుకోగానే పరిపాలనలో చంద్రబాబు విఫలమైనట్లు తీవ్రంగా ఆరోపించారు.  మొదటి నుండి పవన్ లో కనిపించే స్ధిరత్వమేమిటంటే జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడటంలోనే.  ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చినా జగన్ పై ఎగిరెగిరి పడటమే ఏకైక టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకనే పవన్ రాజకీయ యాత్రలపై నెటిజన్లు దుమ్ము దులిపేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: