ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించాక.. రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించారు. మొత్తం 30వేలకు పైగా ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. అయితే ఈ భూమిని ఆ తర్వాత అనేక సంస్థలకు సీఆర్డీఏ ద్వారా కట్టబెట్టారు. ఇలా అమరావతి ప్రాంతంలో భూములు దక్కించుకున్న సంస్థల వివరాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు.

 

ఆయన భూకేటాయింపుల గురించి అసెంబ్లీలో ఏమన్నారంటే.. “ చంద్రబాబు ప్రభుత్వం రాజధాని భూకేటాయింపుల్లో పద్ధతి లేదు..పాలసీ లేదు. వివిధ యూనివర్సిటీలకు భూములు కేటాయించారు.1600 ఎకరాలు వివిధ సంస్థలకు ఇచ్చారు. ఇందులో 1300 ఎకరాలు ప్రైవేట్‌ వ్యక్తులకు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు ఇచ్చారు. ప్రైవేట్‌కు, ప్రభుత్వ సంస్థలకు ఏ రేట్‌కు భూములు ఇచ్చారో గమనిస్తే..కేంద్ర ప్రభుత్వానికి 5.50 ఎకరాలు కోటి రూపాయలకు ఎకరా ఇచ్చారు. ఇది 60 సంవత్సరాల వరకు లీజ్‌కు ఇచ్చారు. ఇండియన్‌ నేవీకి 15 ఎకరాలు ఇచ్చారు. ఎకరా కోటి చొప్పున ఇచ్చారు. బీఐఎస్‌కు 30 సెంట్లు ఇచ్చారు. ఇది కూడా 60 ఏళ్లు లీజు, సీఏజీకి 15 ఎకరాలు, సీబీఐకి 3.50 ఎకరాలు, ఐజీఎన్‌వోయూ 80 సెంట్లు, ఐఎండీ ఎకరా ఇచ్చారని తెలిపారు.

 

" ఇండియన్‌ ఆర్మీకి 4 ఎకరాలు ఇచ్చారు. రియల్‌ టైం కార్పొరేషన్‌కు ఎకరా రూ.4 కోట్లు ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఎస్‌బీఐకి 1.30ఎకరాలు ఇచ్చారు. ఎకరా రూ.4 కోట్లు, నాబార్డుకు 4.30 ఎకరాలు, ఎఫ్‌సీఐకి 4 ఎకరాలు, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు ఎకరా రూ.4 కోట్లు చొప్పున ఇచ్చారు. హెచ్‌పీసీఎల్‌, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఫుడ్‌ కోర్‌ రిజినల్‌ ఆఫీస్‌, కేనరా బ్యాంకుకు ఎకరా నాలుగు కోట్ల చొప్పున ఇచ్చారని మంత్రి బుగ్గన వివరించారు.

 

" ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.4 కోట్ల చొప్పున 60 ఏళ్లు లీజ్‌కు ఇచ్చారు. యూనివర్సిటీకి 200 ఎకరాలు ఇచ్చారు. ఎకరా రూ.50 లక్షల చొప్పున, అమృత యూనివర్సిటీకి 200 ఎకరాలు, మరో యూనిర్సిటీకి 150 ఎకరాల చొప్పున ఇచ్చారు. మెడిసిటీ ఆఫ్‌ హెల్త్‌కు 150 ఎకరాలు ఇచ్చారు. ఆశ్చర్యంగా భూములు కట్టబెట్టారు. పబ్లిక్‌ సర్వీసెస్‌ 180 ఎకరాలు, 7 కేంద్ర సంస్థలకు 69 ఎకరాలు ఇచ్చారు. స్టార్‌ హోటళ్లకు కూడా భూములు ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.4 కోట్లు, ప్రైవేట్‌ సంస్థలకు మాత్రం ఎకరా రూ.50 లక్షల చొప్పున ఇచ్చారంటూ మంత్రి బుగ్గన జాబితా చదివి వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: