ఈ మాట నేను చెప్పటం లేదు. వైసిపిలో కీలక నేత, మంత్రి కొడాలి నాని స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు.  మూడు రాజధానులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సంద్భంగా కొడాలి మాట్లాడుతూ  రాజధానిగా అమరావతిని తరలించేస్తే కమ్మోళ్ళకు ఇబ్బందులు వస్తాయని, కమ్మ సామాజికవర్గం భారీగా నష్టపోతుందని చంద్రబాబునాయుడు ఎల్లోమీడియాతో పిచ్చి కథనాలు రాయిస్తున్నట్లు మండిపడ్డారు. ఒక విధంగా తన స్పీచ్ లో కొడాలి చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పేర్లు చెప్పటమే కాకుండా వాటి యాజమాన్యాలంటూ రాధాకృష్ణ, రామోజీరావు పేర్లను కూడా చెప్పి గాలి  తీసేశారు. నిజానికి బహిరంగంగా ప్రకటించటానికి చాలా ధైర్యం కావాలి.

 

రాజధానిని తరలించేస్తామని తమ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదన్నారు.  రాజధానిగా అమరావతికి అదనంగా మరో చోట కూడా రాజధాని పేరుతో డెవలప్ చేస్తామని మాత్రమే చెబుతున్నట్లు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనల ప్రకారం విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేసుకుని మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది మాత్రమే ఆలోచనగా చెప్పటం గమనార్హం.

 

ఇదే సందర్భంగా గతంలో ఆంధ్రజ్యోతిలో కమ్మ సామాజికవర్గం సమస్యల గురించి, అస్ధిత్వం గురించి వచ్చిన కథనాలను ప్రస్తావించారు. వాళ్ళు బాధపడుతున్నట్లు కమ్మోరికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని భరోసా ఇచ్చారు. ఇపుడు కమ్మోరికి అమరావతి మాత్రమే రాజధాని అయితే జగన్ వల్ల విశాఖపట్నం కూడా  కమ్మోరి రాజధానే అవుతుందంటూ హామీ ఇచ్చారు.

 

విశాఖపట్నంలో కూడా కమ్మోరి ప్రభావం బాగా ఎక్కువుగానే ఉన్న విషయం అందరూ చూస్తున్నదేనన్నారు. కమ్మోరు ఎక్కడైనా రాణించగలిగిన తెలివి ఉన్నవారుగా చెప్పారు. విశాఖలో మొదటి నుండి ఎంపిలుగా గెలుస్తున్నది కమ్మోళ్ళే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.  హోటల్సు, పెద్ద పెద్ద కార్ల షోరూములు, టూవీలర్ షోరూములు, ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్సులు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో దాదాపు కమ్మోరివే అంటూ వివరించటంతో సభ్యులందరూ పెద్దగా నవ్వేశారు.   కాబట్టి జగన్ పాలనలో కమ్మోరికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని పైగా రెండో రాజధానిగా విశాఖపట్నం తయారవుతోందని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: