తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల బరిలో గతంలో ఎన్నడూ లేని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి రావడం, భూముల విలువలు భారీగా పెరగడంతో రియల్టర్లే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువగా పోటీ చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఆశీస్సులతో ఇన్నిరోజులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రియల్టర్లు తామే ఎన్నికల్లో గెలిస్తే ఎవరి దగ్గరికీ వెళ్లనవసరం లేదని భావిస్తున్నారు.         
 
రాజకీయాల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అతి తక్కువ కాలంలోనే ఆ డబ్బును వెనక్కు తెచ్చుకోవచ్చని నమ్ముతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా రియల్ వ్యాపారులే ఎక్కువ సంఖ్యలో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులే తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలు కూడా రియల్టర్లు ఐతే ఎంత ఖర్చుకైనా వెనుకాడరని వారినే ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో స్థిరాస్థి వ్యాపారుల జోరు కనిపిస్తోంది. పురపోరులో ఎక్కడ చూసినా రియల్టర్ల డామినేషన్ కనిపిస్తూ ఉండటం గమనార్హం. తమ వ్యాపారాలకు కౌన్సిలర్/ కార్పొరేటర్ పదవులు కవచంలా ఉంటాయని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిస్తే పనులను చక్కబెట్టుకోవచ్చని రియల్టర్లు భావిస్తున్నారు. 
 
రిజర్వేషన్లను మహిళలకు కేటాయిస్తే రియల్టర్లు వారి భార్యలను బరిలోకి దించి మరీ ఎన్నికల్లో పోటీ చేయిస్తూ ఉండటం గమనార్హం. పార్టీలు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో చక్రం తిప్పినవారికి పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు ఉన్నవారికే బీ ఫారాలను అందజేశాయి. సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేపట్టిన తరువాత కొత్త జిల్లా కేంద్రాలు ఏర్పడటంతో భూముల ధరలకు ఆ ప్రాంతాలలో రెక్కలొచ్చాయి. రియల్టర్లు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఓటర్లపై కాసుల వర్షం కురిపిస్తున్నట్టు ఓటుకు వెయ్యి రూపాయల నుండి 13,000 రూపాయల వరకు పంచుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: